టీఆర్‌ఎస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

24 Jul, 2014 00:51 IST|Sakshi
టీఆర్‌ఎస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్
 
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, మిగతా సమాజాన్ని విస్మరిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తామని ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఉద్యోగులకు ఈ నెల వేతనాలు 25వ తేదీన ఇస్తే తమకు అభ్యంతరం లేదని, దసరా, దీపావళి, క్రిస్మస్ తదితర పండుగలకూ ఇదే విధంగా  ముందస్తుగా వేతనాలు చెల్లిస్తారా?  అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తెలంగాణ బిడ్డలకు రూ.25లక్షలిచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో పుట్టి, హైదరాబాద్‌కు 1986లో వచ్చి పెరిగి,  పాకిస్థాన్ కోడలిగా వెళ్లిన క్రీడాకారిణి సానియామీర్జాను  తెలంగాణ అంబాసిడర్‌గా  ఎంపిక చేయడంతో పాటు రూ. కోటి నజరానా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

పేద, బడుగు, బలహీనవర్గాల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో 1956 స్థానికతను గుర్తిస్తామన్న ప్రభుత్వం ఆమెకు ఏవిధంగా  అంబాసిడర్‌గా గుర్తించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యురాలైన కవిత జమ్మూ-కాశ్మీర్, తెలంగాణ ప్రాంతాలను బలవంతంగా దేశంలో కలిపారని చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. నిజాం పాలననుంచి విముక్తి కలిగించిన సర్దార్ వల్లభాయ్‌పటేల్‌ను  అవమానించే విధంగా ఆమె వ్యాఖ్యలు  ఉన్నాయన్నారు. మతప్రాతిపదికన రిజర్వేషన్‌ల అమలును చేపడితే బీజేపీ వ్యతిరేకిస్తుందని, అవసరమైతే  ఆందోళలు చేపట్టి  అడ్డుకుంటుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డిలు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు