కేసీఆర్ తప్పించుకుంటున్నారు: లక్ష్మణ్

31 Aug, 2017 20:06 IST|Sakshi
కేసీఆర్ తప్పించుకుంటున్నారు: లక్ష్మణ్
  • రేపటి నుంచి తెలంగాణ విమోచన యాత్ర
  • బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ డిమాండ్‌
  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ విమోచన యాత్రను శుక్రవారం నుంచి మొదలు పెడుతున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చెప్పారు. మొత్తంగా వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రజాకారుల ఆగడాలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయని, వాటన్నింటినీ సందర్శించి, ప్రజలకు తెలంగాణ విమోచన  ప్రాధాన్యం గురించి వివరిస్తామన్నారు.

    తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం రోశయ్యను ప్రశ్నించారని, విమోచన దినోత్సవం నిర్వహించకపోతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్‌ పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఆ మాటే మరిచారని వ్యాఖ్యానించారు.

    పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహిస్తామని యాత్రలో ప్రజలకు చెబుతామన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లీస్‌ పార్టీకి తాకట్టు బెడితే ప్రజలు ఊరుకోరని లక్ష్మణ్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు