ఫసల్‌ బీమా అమలులో విఫలం

1 Jul, 2017 02:15 IST|Sakshi
ఫసల్‌ బీమా అమలులో విఫలం

ప్రభుత్వంపై లక్ష్మణ్‌ ధ్వజం
వ్యవసాయ కమిషనరేట్‌ వద్ద కిసాన్‌ మోర్చా ధర్నా

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఫసల్‌ బీమా యోజన అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ముందు బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులుంటే, వారిలో కనీసం 10 శాతం మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజనలో చేర్పించ లేకపోయిందన్నారు. దీనివల్ల కరువు, అతి వృష్టి, వరదలు వంటివాటితో పంటనష్టపోయిన రైతులు పరిహారం పొందే అవకాశంలేకుండా పోయిందన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటరుణాలను ఒకేసారి మాఫీ చేశామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగువిడతలుగా చేసిందన్నారు. దీనివల్ల రైతులకు వడ్డీ పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నమాట అబద్ధమని లక్ష్మణ్‌ అన్నారు. రుణమాఫీ పూర్తికాకపోవడం వల్ల రైతులకు బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో, వారికి రుణాలను ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, వారి కుటుంబా లను ప్రభుత్వం ఆదుకోవడంలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని లక్ష్మణ్‌ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, బద్దం బాల్‌రెడ్డి, పుష్పలీల, నందీశ్వర్‌గౌడ్, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు