పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే ప్రయోజనం 

31 Dec, 2018 02:09 IST|Sakshi

‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణలో కె.రోశయ్య  

సాక్షి,హైదరాబాద్‌: పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ చేకూరుతుందని, తీసుకెళ్లి షోకేసుల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన ‘నవ్యాంధ్రతో నా నడక’పుస్తకంతో పాటు ‘దిస్‌ దట్‌ ఎవ్రిథింగ్‌’.., ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాలను ఆదివారం ఫ్యాప్సీలో రోశయ్య ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది పుస్తకాలు తీసుకెళ్తుంటారే కానీ, వాటిని చదవరని, అలాంటి వాళ్లతో ప్రయోజనం ఉండదన్నారు. వృత్తిపరంగా ఐవైఆర్‌ కృష్ణారావు అనుభవాలు, రాజకీయనేతలతో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పర్యవసానాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.

ఇతరులను కించపరచడానికో లేక.. డైరెక్షన్‌ చేయడానికో ఈ పుస్తకం రాయలేదని, వృత్తిపరంగా ఎదుర్కొన్న అనుభవాలను, ఎంచుకు న్న ధోరణిలో రాశారన్నారు. భారత్‌టుడే చీఫ్‌ ఎడిట ర్‌ జి.వల్లేశ్వర్‌ పుస్తక సమీక్ష చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తుండటాన్ని చూస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని మాజీ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ సంపాదకుడు ఎంవీఆర్‌ శాస్త్రి మాట్లాడుతూ విభజన సమయంలో ఓ అధికారి ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రతిరూపమే ఈ పుస్తకమన్నారు. రచయిత ఐవైఆర్‌ మాట్లాడుతూ ఏపీ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఆగమేఘాలపై రాజధాని తరలింపు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, జవాబుదారీతనం లేని సీఎంఓలో పని చేయడం వల్ల జరిగిన నష్టాలను ఇందులో వివరించానన్నారు. 

మరిన్ని వార్తలు