కాచిగూడ-కరీంనగర్‌ రైలు ప్రారంభం

16 Jun, 2018 14:16 IST|Sakshi
నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కాచిగూడ-కరీంనగర్‌ రైలు 

నిజామాబాద్‌అర్బన్‌ : కాచిగూడ - నిజామాబాద్‌ ప్యాసింజర్‌ రైలును కరీంనగర్‌ వరకు పొడగించగా శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణలతో కలిసి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాం మాట్లాడుతూ కరీంనగర్‌ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మరిన్ని సౌకర్యలు కల్పించాలని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రైల్వేస్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్లాట్‌ఫారాలను పెంచాలని, ఎస్కలేటర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్‌యూబీ పనులను కూడా త్వరగా పూర్తి చేయలన్నారు. అనంతరం కలెక్టర్‌ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ఈ రైలు ప్రారంభించడంతో ప్రజలకు సౌకర్యవంతంగా మారిందన్నారు.

రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రైళ్లను, రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.  అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా రైలు క్యాబిన్‌లో కూర్చొని రైలు నడిపే విధానాన్ని పరిశీలించారు. రైల్వే అధికారులతో రైల్వేస్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్పొరేటర్లు, పాల్గొన్నారు. 

రైలు రాకపోకల వేళలు

రైలు నెంబర్‌ 57601 రైలు కరీంనగర్‌-జగిత్యాల - నిజామాబాద్‌ - కామారెడ్డి- మేడ్చల్‌ - కాచిగూడ మధ్య అన్ని స్టేషన్‌లలో ఆగుతుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది. ప్రయాణంలో ఈ రైలు కరీంనగర్‌ స్టేషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 

వేల్పూర్‌లో స్వాగతం

వేల్పూర్‌: కాచిగూడ, కరీంనగర్‌ రైలుకు వేల్పూర్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం బీజేపీ మండలాధ్యక్షుడు బట్టు లక్ష్మణ్‌ స్వాగతం పలికారు. అదే రైలులో ప్రయాణిస్తున్న నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్‌ రూట్లో మరోరైలు ఇక్కడి ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం మోర్తాడ్‌ వరకు రైలులో బయలుదేరి వెళ్లారు.  

మరిన్ని వార్తలు