‘సారు..కారు..16’కు మద్దతు

29 Mar, 2019 07:02 IST|Sakshi
బాధితుడికి చెక్కు అందిస్తున్న కాదంబరి కిరణ్‌ తదితరులు

పంజగుట్ట: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అములు చేస్తోందని సినీనటుడు, ‘మనంసైతం’ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్‌ అన్నారు. ‘చిన్న సారు.. కారు.. 16’ లక్ష్యంగా తాము సైతం టీఆర్‌ఎస్‌కు సహకారం అందిస్తామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురి కుటుంబాలకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించారు. ఈ సంరద్భంగా కిరణ్‌ మాట్లాడుతూ.. తన 35 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పేదరికం నుండి పైకి వచ్చానన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. బెల్లంపల్లిలో ఓ రైతు భూమిని వీఆర్‌ఓ అక్రమంగా లాక్కుంటే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు బాధితుడికి సాయం చేశారని, పేదవారు ఇబ్బందుల్లో ఉంటే ఎలా స్పందిస్తారో సీఎం స్వయంగా చూపించారన్నారు.

తమ వంతు బాధ్యతగా 16 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు(బందర్‌ బాబీ), జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌ వల్లభనేని, సురేష్‌ కుమార్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, వరంగల్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు బొట్టుపల్లి రాజ్‌కుమార్‌ కొడుకు సోమేశ్వర్‌ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. వాచ్‌మెన్‌గా జీవనం కొనసాగిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పుల్లయ్యకు, ఇటీవలే భార్య చనిపోయి, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డ్రైవర్‌ నాగేశ్వర రావుకు ఈ సందర్భంగా కిరణ్‌ ఆర్థిక సాయం అందించారు.  

మరిన్ని వార్తలు