దళితుల హక్కులపై దాడి: కడియం

21 Apr, 2018 02:19 IST|Sakshi

సంఘటితంగా ఉంటేనే ప్రభుత్వాలు, పార్టీలు భయపడుతాయి

సాక్షి, హైదరాబాద్‌: కొంతకాలంగా రాజ్యాంగంతోపాటు దళితుల హక్కులపై దాడి జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదుగుతున్నారని, అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నారని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర సాగుతోందని అన్నారు. బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 127వ జయంతి ఉత్సవాలు శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కడియం మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఎంతో ముందుచూపుతో రాసిన రాజ్యాంగం నేటి సమకాలీన సమస్యలకు కూడా పరిష్కారం చూపుతోందన్నారు. ఆరు దశాబ్దాలపాటు పోరాటం జరిగినా అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన వివరాలను బట్టి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కోరలను సుప్రీంకోర్టు తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని కొంతమంది ఆందోళన చేస్తున్నారని, ఇలాంటివాటి పట్ల దళితులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

దళితులు సంఘటితంగా ఉన్నప్పుడే పార్టీలు, ప్రభుత్వాలు భయపడతాయని అన్నారు. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ వద్ద జరిగిన చర్చలో దళితబిడ్డలకు నాణ్యమైన విద్య అందించేందుకు 125 గురుకులాలు ఏర్పాటు చేయాలని కోరానని, అయితే సీఎం ఏకంగా 577 గురుకులాలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌ బాటలో నడుస్తోందని చెప్పారు.

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ గంటా చక్రపాణి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాబూమోహన్, ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు