తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు

26 May, 2018 02:33 IST|Sakshi
డీఈవోల సమావేశంలో మాట్లాడుతున్న కడియం  

పాఠశాలల ప్రారంభం రోజే అందజేస్తామన్న కడియం

వాటితో పాటే యూనిఫాం.. విద్యార్థినులకు ‘హైజీన్‌ కిట్స్‌’ 

జిల్లా విద్యాశాఖాధికారులతో కడియం సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : బడి తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. జూన్‌ ఒకటో తేదీన పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని, ఆ రోజుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకే యూనిఫాం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఈ ఏడాది నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా యూనిఫాం ఇస్తామని స్పష్టం చేశారు. పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం కడియం శ్రీహరి ఎస్‌ఎస్‌ఏ భవన్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కొత్త విద్యాసంవత్సరాన్ని విజయవంతంగా నడిపించాలని, జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఉన్నందున వేసవి సెలవులను ముందుకు జరిపామని పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొనే అవకాశముంటుందని చెప్పారు. 

8 లక్షల మంది విద్యార్థినులకు ‘కిట్స్‌’ 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి  85 కోట్ల రూపాయల ఖర్చుతో ఎనిమిది లక్షల మంది విద్యార్థినులకు హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ అందిస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. జెడ్పీ స్కూళ్లు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఈ కిట్లు అందిస్తామన్నారు. ఈ కిట్లలో విద్యార్థినులకు అవసరమైన కాస్మొటిక్‌ వస్తువులు ఉంటాయని, అవన్నీ బ్రాండెడ్‌ వస్తువులేనని చెప్పారు. ఒక్కో కిట్‌ ధర రూ.400 వరకు ఉంటుందని, ప్రతి కిట్‌లో మూడు నెలలకు సరిపోయేలా వస్తువులుంటాయన్నారు. ఏటా నాలుగుసార్లు ఈ కిట్లు సరఫరా చేస్తామన్నారు. కిట్ల పంపిణీలో స్థానిక నేతలను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.

జూలైలో అన్ని పాఠశాలల్లో హరితహారం
జూలైలో అన్ని పాఠశాలల్లో పెద్ద ఎత్తున హరితహారం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈసారి విద్యా వాలంటీర్ల అవసరం లేకుండా కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలు నిర్వహిద్దామని అనుకున్నామని.. కానీ కోర్టు కేసుల వల్ల మళ్లీ వాలంటీర్లను నియమించుకోవల్సి వస్తోందని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. విద్యా సంవత్సరం అకడమిక్‌ కేలండర్‌పై జూన్‌ మొదటి వారంలో వర్క్‌షాప్‌ నిర్వహిస్తామన్నారు. ఈ వర్క్‌షాప్‌లో సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం)పై కూడా సమీక్ష చేస్తామని, ఇందులో వచ్చిన ప్రతిపాదనలను అమలు చేస్తామన్నారు.
 

>
మరిన్ని వార్తలు