ఆ స్వరం.. నూటికి వెయ్యిశాతం బాబుదే

12 Jun, 2015 03:08 IST|Sakshi
ఆ స్వరం.. నూటికి వెయ్యిశాతం బాబుదే

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు ఆడియో టేపులోని స్వరం నూటికి వెయ్యి శాతం ఏపీ సీఎం చంద్రబాబుదేనని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆయనతో తనకు 30 ఏళ్ల అనుబంధముందని, తప్పు చేసినప్పుడు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్, వణకుతూ ఊగిపోవడం తన అనుభవంలో చాలాసార్లు చూశానన్నారు. ఢిల్లీలో గురువారం శ్రీహరి, ఎంపీ వినోద్ కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

శాంతిభద్రతలు, సెక్షను 8 అమలు, గవర్నర్‌కు అధికారాలనేవి అసలు ఇప్పుడు అంశాలు కానేకావన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఫోను ట్యాప్ చేసిందని చంద్రబాబు పచ్చి అబద్దాలాడుతున్నారని, ఆధారాలుంటే ఎందుకు ఫిర్యాదు చేయడంలేదని ప్రశ్నించారు.  ఓటుకు నోటు కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోందని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. సాయంత్రం రైల్వేమంత్రి సురేష్ ప్రభును కలిసి కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్-ఛత్తీస్‌గఢ్ నాలుగులేన్ల రహదారి నిర్మాణ పనుల శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు