ఎమ్మెల్యే రాజయ్యతో ఎలాంటి విభేదాలు లేవు : కడియం

28 Jun, 2018 19:50 IST|Sakshi

సాక్షి, జనగామ : తనకు రాజయ్యకు ఎలాంటి విభేదాలు లేవనీ, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మాత్రమే వినియోగిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ ఘన్‌పుర్‌ మండలంలోని తాటికొండ గ్రామంలోని నూతన పంచాయితీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మం‍త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఎన్ని జన్మలెత్తినా స్టేషన్‌ ఘన్‌పుర్‌ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. ఎవరికీ తలవంపులు తీసుకురాకుండా.. ఒక్క పైసా లంచం తీసుకోకుండా పనిచేస్తున్నానని అన్నారు. నియోజక వర్గ ప్రజల విశ్వాసాన్ని నిలబెడతానని, నాకు రాజయ్యకు ఎలాంటి విభేదాలు లేవనీ కలిసే పని చేస్తామని స్పష్టం చేశారు. 

ఆనాడు దేవాదుల ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చానని, ఈనాడు లింగంపల్లి రిజర్వాయర్‌ తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. వారంలోపే లింగంపల్లి రిజర్వాయర్‌ పనులకు టెండర్లు పిలిచి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి గ్రామాలకు 4వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కాలువలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తాటికొండ నుండి గండిరామరం మీదుగా నర్మెట వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అందించారని, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభివృద్దికి నా సహాయసహాకారాలు ఉంటాయని చెబుతూనే.. రాజయ్య కోరిన జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై దాట వేశారు.  

మరిన్ని వార్తలు