రాజయ్యకు ఓ న్యాయం... ఆయనకో ..

5 Aug, 2015 00:12 IST|Sakshi
రాజయ్యకు ఓ న్యాయం... ఆయనకో ..

- కడియంను బర్తరఫ్ చేయాలి
- ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలి
- టీడీపీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు

వరంగల్:
వైద్యశాఖలో అవినీతి జరిగితే అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యతో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాశాఖలో అదే తంతు జరిగితే సంబంధిత శాఖ మంత్రి కడియం శ్రీహరితో ఎందుకు రాజీనామా చేయించడం లేదని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. అతనికి ఓ న్యాయం...ఇతనికో న్యాయమా అని నిలదీశారు.

హన్మకొండలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో జరిగిన అవినీతిలో టీఆర్‌ఎస్ నేతల్లో కొందరికి సంబంధాలు ఉన్నాయన్నారు. డీఈఓతో డిప్యూటీ డీఈఓలకు కూడా ఈ అవినీతిలో సంబంధాలు ఉన్నాయన్నారు. వారిని కూడ సస్పెండ్ చేయడంతోపాటు ఈ శాఖలో జరిగిన అవినీతికి బాధ్యుడిని చేస్తూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఒక జిల్లాకు చెందిన డీఈఓ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం పలు అనుమానాలకు దారి తీస్తోందన్నారు.  
 
నేటి ధర్నాను విజయవంతం చేయాలి...

ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యానికి నిరసనగా హౌసింగ్ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహిస్తున్న ఒక రోజు దీక్ష, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘ఇప్పుడున్న ఇంట్లో అల్లుడు వస్తే ఎక్కడ పంటారు.. నేను అధికారంలోకి వస్తే రెండు బెడ్‌రూంలు, డైనింగ్ , కిచెన్, హాల్ ఉండే ఇళ్లు ఇస్తాం’ అని అన్న కేసీఆర్ కట్టుకున్న ఇళ్లకు బిల్లులు ఇచ్చే గతి లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ జిల్లా కన్వీనర్ బస్వారెడ్డి, అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, నాయకులు గండ్ర సత్యనారాయణరావు, పుల్లూరు అశోక్‌కుమార్, మార్గం సారంగపాణి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు