బాల కార్మికుల్లేని తెలంగాణను నిర్మిద్దాం

1 Mar, 2018 02:18 IST|Sakshi

బాలల హక్కుల సాధనకు కృషిచేద్దాం: సత్యార్థి

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు..

పిల్లల హక్కులు హరించే వారిపై ఉక్కుపాదం: ఈటల

కరీంనగర్‌ లీగల్‌/శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్‌)/ఇబ్రహీంపట్నం రూరల్‌ : బాల కార్మికుల్లేని తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి పిలుపునిచ్చారు. దేశంలో పిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంరక్షణ కోసం అందరూ ఉద్యమించాలన్నారు. ప్రపంచంలో 53 శాతం బాలలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని శేరిగూడ శ్రీఇందు ఇంజనీరింగ్‌ కళాశాలలో ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ తెలంగాణ’అంశంపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్నారు.

పిల్లల సంతోషాలు, కళలను పట్టించుకోకపోవడంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోందని, చాలా ప్రాంతాల్లో పిల్లలు బాలకార్మికులుగా మగ్గిపోతున్నారని, పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కాలేజీ ఆడిటోరియానికి కైలాశ్‌ సత్యార్థి ఆడిటోరియంగా నామకరణం చేశారు.

ప్రతి ఒక్కరి బాధ్యత..
చిన్న పిల్లలపై లైంగిక దాడులు పెరగుతున్నాయని, ప్రతి గంటకు సగటున నలుగురు పిల్లలు లైంగికదాడులకు గురవుతున్నారని సత్యార్థి పేర్కొన్నారు. వీటి నిర్మూలనకు సమాజంలోని పౌరులంతా బాధ్యతగా కృషి చేయాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో బాలల హక్కులను పరిరక్షిస్తూ ప్రపంచంలోనే భారత్‌ను అగ్రగామిగా నిలుపుకొందామని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో ఎంపీ వినోద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన బాలమిత్ర సదస్సుకు హాజరయ్యారు. తల్లిదండ్రుల్లేని అనాథ పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని పార్లమెంటులో బిల్లు పెట్టిన వినోద్‌ను అభినందించారు.

నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల సంక్షేమానికి 500 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు వివిధ రాష్ట్రాల్లో సత్యార్థి ఫౌండేషన్‌ సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని చాలా పాఠశాలల్లో టాయిలెట్లు లేక పిల్లలు బడి మానేస్తున్నారని చెప్పారు.

ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే పాఠశాలల్లో ఎన్నికలు, పార్లమెంట్, పంచాయితీ వంటివి ఏర్పాటు చేసి పిల్లలకు బాధ్యతలు తెలపాలని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పిల్లల హక్కులు హరించే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు