ప్రమాదకరంగా కాకతీయ కాలువ

19 Jul, 2019 10:00 IST|Sakshi

రెండు చోట్ల ధ్వంసం

బుంగలు ఏర్పడే అవకాశం

పట్టించుకోని అధికారులు

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేసే కాకతీయ కాలువ రెండు చోట్ల ప్రమాదకరంగా మారింది. అధికారులు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రెండు చోట్ల బుంగలు ఏర్పడే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ కాలనీకి నీటి సరఫరా చేసే వాటర్‌ సప్లయి ట్యాంకు వద్ద కాలువ ఒక చోట్ల ధ్వంసం అయ్యింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాలనీకి నీటి సరఫరా చేసేందుకు పైపులైన్‌ వేసి వాటర్‌ ట్యాంక్‌ నిర్మించారు. వాటర్‌ ట్యాంకులో నీరు శుద్ధి కాగా మిగిలిన నీటిని కాకతీయ కాలువలో మళ్లించేందుకు పైపులైన్‌ వేశారు. కానీ పైపు కాలువ వరకు లేక కాలువ కట్ట మధ్య వరకే పైపులైన్‌ ఉండడంతో మిగిలిన నీరు కాలువ కట్టలో పోస్తోంది. దీంతో కట్ట క్రమంగా కోతకు గురై బుంగ ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు కోతకు గురవుతుండడం, మరోపక్క ఈ రోడ్డుపై పెద్ద వాహనాలు వెళ్తుండడంతో కట్టకు బుంగ ఏర్పడే ప్రమాదం మెండుగా ఉంది. అలాగే కాకతీయ కాలువ క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద కూడా కాలువ ప్రమాదకరంగా ఉంది. ఈ రెండు చోట్ల కాలువ క్రమంగా కోతకు గురవుతున్న అధికారులు మరమ్మతులు చేపట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అయితే ఈ కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులను సైతం మంజూరు చేసింది. కానీ ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు. వాటర్‌ సప్లయి వలన కాలువకు బుంగలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు అతి సమీపంలో కాలువ దుస్థితి ప్రమాదకరంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదు. బుంగ ఏర్పడితేనే మరమ్మతులు చేపడతారా అంటూ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు స్పందించి వెంటనే కాలువకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు