ప్రపంచ వారసత్వ గుర్తింపే లక్ష్యం

28 Apr, 2015 00:14 IST|Sakshi

వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బరిలో కాకతీయ కట్టడాలు
డోసియర్ రూపకల్పనకు కేంద్రం ఆదేశం
మూడేళ్లుగా సాగుతున్న కృషి
గుర్తింపు సాధిస్తే ఉపాధికి ఊపు

 
హన్మకొండ : ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు సాధించే క్రమంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా రామప్పగుడి, వేయి స్తంభాల దేవాలయం, ఖిలావరంగల్ కీర్తితోరణాలపై సమగ్ర నివేదిక రూపొందించాల్సిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డోసియర్ రూపకల్పనలో కాకతీయ హెరిటేజ్ సంస్థ నిమగ్నమైంది. కాకతీయుల కళావైభవానికి ప్రతీకలుగా నిలిచిన ఈ కట్టడాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. యునెస్కో- వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటిటేవ్ జాబితాలో ఇప్పటికే ఈ కట్టడాలకు చోటు లభించింది.

డోసియర్ రూపకల్పనకు ఆదేశాలు

రామప్పగుడి, రుద్రేశ్వరాలయం, ఖిలావరంగల్ శిలాతోరణాలు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు సాధించే క్రమంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. రాబోయే రోజుల్లో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం దేశవ్యాప్తంగా పోటీపడుతున్న చారిత్రక కట్టడాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  2015 ఏప్రిల్ 10న న్యూఢిల్లీలో జరిగిన(నేషనల్ వర్క్‌షాప్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఇండియన్ సైట్స్ ఆన్ టెంటిటేటివ్ లిస్ట్ ఫర్ ఫ్యూచర్ నామినే షన్స్ యాజ్ వరల్డ్ హెరిటేజ్) సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రామప్ప ఆలయం, వేయిస్థంభాలగుడి, ఖిలావరంగల్ విశిష్టతలను కేంద్ర, రాష్ట్ర పురవస్తు శాఖతోపాటు కాకతీయ హెరిటేజ్ ట్రస్టుల నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు ఈ సదస్సులో తెలియజేశారు. ఈ సందర్భంగా చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకునే జాగ్రత్తలు, ప్రస్తుతం చారిత్రక కట్టడాలు ఉన్న తీరు, చారిత్రక కట్టడాల విశిష్టతలను తెలిపేలా సమగ్ర సమాచారంతో డోసియర్(పూర్తి సమాచారంతో కూడిన నివేదిక) రూపొందించాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కోసం నామినేషన్ దాఖలు చేయడంలో ఈ డోసియర్‌ది కీలకమైన పాత్ర. ఆరు నెలల్లోపు పురవస్తుశాఖ , కాకతీయ హెరిటేజ్ సంస్థలు ఈ డోసియర్‌ను రూపొందించాల్సి ఉంది.

మూడేళ్లుగా సాగుతున్న కృషి

2012 ఆగస్టులో చెన్నైలో జరిగిన సదరన్ రీజియన్ కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ హెరిటేజ్ సదస్సులో కాకతీయ హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు వేయిస్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, ఖిలావరంగల్ శిలాతోరణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ సానుకూల స్పందన లభించడంలో ఇంటర్నెషనల్ కమిటీ ఆఫ్ మాన్యుమెంట్స్, స్ట్రక్చర్స్(ఐకోమస్, పారిస్) సంస్థకు సైతం కాకతీయుల చారిత్రక కట్టడాల విశిష్టతను గుర్తించాల్సిందిగా కోరుతూ దరఖాస్తు చేశారు. ఆ తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటేటివ్ లిస్ట్ -2014లో  కాకతీయ కట్టడాలకు చోటు లభించింది. తాజాగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటే కేంద్రం ఆదేశించింది.
 
యునెస్కో గుర్తింపు లభిస్తే


కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక హృదాయ్‌లో వరంగల్ నగరానికి ఇటీవల చోటులభించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్-కరీంనగర్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన అద్భుత కట్టడాలకు ప్రచారం లభిస్తుంది. ఈ  కట్టడాల పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధికై ఇటు యునెస్కోతో పాటు కేంద్రం, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి నిధుల ప్రవాహం ఉంటుంది. ఇందుకు కర్ణాటకలోని హంపీ మంచి ఉదాహరణ. యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది. టూరిస్టుల సంఖ్య నాలుగింతలైంది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ మార్పుకు తగ్గట్టుగా అక్కడ హోటళ్లు, టాక్సీలు, ఫుడ్‌కోర్టులు, గైడ్‌ల సంఖ్య పెరిగింది. ఫలితంగా యువతకి ఉపాధి మార్గాలు మెరుగయ్యాయి. అదే పద్ధతిలో వేయి స్తంభాలగుడి, రామప్ప, ఖిలావరంగల్‌కు యునెస్కో గుర్తింపు లభిస్తే జిల్లాలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, గణపురం కోటగుళ్లు, ఐలోని, కొమురవెల్లి, మల్లూరు, మేడారం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవులగుట్ట, గణపురం సున్నపురాయి గుహలు, పెంబర్తి, చేర్యాల హస్తకళలన్నీంటిని కలిపి టూర్ సర్క్యూట్‌గా ఏర్పాటు చేయొచ్చు.
 

మరిన్ని వార్తలు