మమ్మల్ని గుర్తించండి!

7 Dec, 2014 02:00 IST|Sakshi
మమ్మల్ని గుర్తించండి!

ఉద్యమంలో ముందున్నా రాని అవకాశాలు
ఎన్నికలు, నామినేటెడ్‌లో దక్కని ప్రాధాన్యం
అసంతృప్తిలో కాకతీయ వర్సిటీ జేఏసీ నేతలు
టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని కలిసి విజ్ఞప్తులు


‘‘తెలంగాణ పోరులో విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమించింది కాకతీయ యూనివర్సిటీలోనే. ఉస్మానియాలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎన్నో విద్యార్థి సంఘాలు పని చేశాయి. రాజకీయ, ఇతర అవకాశాల విషయంలో మాత్రం మాకు దక్కాల్సిన ప్రాధాన్యత కనిపించడంలేదు.. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు.. కనీసం నామినేటెడ్ పోస్టుల్లోన్నైనా అవకాశం కల్పించాలని’’ కేయూ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు..
 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విద్యార్థులు ప్రముఖపాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతో మలుపుతిరిగిన ఉద్యమంతోపాటు అన్ని పోరాటాల్లో  కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో తమ పాత్ర ఏమిటనేది కేయూ జేఏసీ నేతల్లో మొదలైంది. టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్‌ఎస్‌వీ ముఖ్య నేతల్లో మరీ అధికంగా కనిపిస్తోంది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉస్మానియా విద్యార్థి నాయకులకు అవకాశం ఇవ్వడం బాగానే ఉన్నా.. కేయూ వారికి రాజకీయ అవకాశాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్య మం, ఉప ఎన్నికలు, రాజకీయ కార్యక్రమాలకు తప్ప తమకు అవకాశాల విషయంలో ప్రాధాన్యత దక్కడంలేదని వీరు అభిప్రాయపడుతున్నారు.

అవకాశం ఇవ్వాలి..

కేయూ జేఏసీ అభిప్రాయం ప్రకారమే టీఆర్‌ఎస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో కేయూ విద్యార్థులకు అవకాశం కల్పించలేదు. ఇదే సమయంలో ఉస్మానియా విద్యార్థి నేతల్లో ముగ్గురికి పోటీ చేసే అవకాశం కల్పించింది. మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లోనైనా అవకాశం కల్పిస్తే ఇక్కడి విద్యార్థుల పోరాటాన్ని గుర్తించినట్లుగా ఉంటుంది. ఉద్యమంలో కీలకంగా ఉన్న వారికి అవకాశం కల్పిస్తేనే.. ఉద్యమాల్లో, టీఆర్‌ఎస్‌లో కొత్త తరం వస్తుంది’ అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నమ్మకం పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఉద్యమంలో ముందున్న వారిలో ఒక్కొక్కరికీ అవకాశం వస్తోందని.. తమ వంతు వస్తుందని ఆశిస్తున్నారు. ‘హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు ముందున్నారు. ఉద్యమంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకుని ప్రాధాన్యత ఇస్తున్నారు. కేయూ నుంచి ప్రొఫెసర్లకు అవకాశం కల్పించడంతో సీతారాంనాయక్ ఎంపీగా గెలిచారు. రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్ వ్యవహరించిన ప్రొఫెసర్ టి.పాపిరెడ్డికి కీలకమకైన ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా అవకాశం ఇస్తారని పేర్కొంటున్నారు.

కేయూ విద్యార్థుల పాత్ర కీలకం

తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ నిరహారదీక్ష కార్యక్రమానికి ఊపు తెచ్చింది కాకతీయ విశ్వవిద్యాలయంలోనే. 2009 నవంబరు 29న కేసీఆర్ నిరహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించి అంతముందు కొన్ని వారాలపాటు సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ఏడాది నవంబరు 23న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఐక్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కటిగా ముందుకు నడిపించేందుకు కేయూ విద్యార్థులంతా ఏకమై 2009 నవంబరు 17న జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అవిర్భావం అనేది ఇక్కడే మొదలైందని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఇలా మొదలైన విద్యార్థుల ఉద్యమం.. కేసీఆర్ నిరహార దీక్ష భగ్నంతో ఊపందుకుంది. కేసీఆర్‌ను కరీంనగర్ జిల్లాలోని అల్గునూరు వద్ద అరెస్టు చేసి ఖమ్మం తీసుకువెళ్లే క్రమంలో కేయూ వద్ద విద్యార్థులు చేసిన పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చేందుకు దోహదపడిందని జేఏసీ నేతలు చెబుతుంటారు. ఆ తర్వాత నిర్వహించిన పొలికేక బహిరంగ సభ, జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఉద్యమాల్లో కేయూ విద్యార్థులు ముందున్నారు. ఉద్యమంలో కీలకంగా ఉన్న తమకు ఇప్పుడు కొత్త రాష్ట్రంలో అవకాశాం ఇవ్వాలని కోరుకుంటున్నారు. కేయూ విద్యార్థి నేతలు ఇటీవలే హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్‌ఎస్ కీలక నేతలు టి.హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల, జగదీశ్వర్‌రెడ్డిలకు, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు తమ కోరికలను విన్నవించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు