కునుకు తీస్తున్న ‘కుడా’

14 Oct, 2014 03:05 IST|Sakshi

సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరాన్ని అభివద్ధి పట్టాలపై పరుగులు పెట్టించేందుకు నెలకొల్పిన కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కునుకు తీస్తోంది. కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ  పథకాలు ఆరంభశూరత్వంగా మారుతున్నాయి. ఆర్భాటాలకు పోయి కొత్త పథకాలు ప్రకటించడమే తప్ప... కార్యాచరణలో వాటిని పూర్తి చేయడం లేదు. పలువురు అధికారుల చేతివాటంతో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. నగరంలో లెక్కకు మిక్కిలిగా రోజుకో అక్రమ లే  అవుట్లు వెలుస్తున్నా ‘కుడా’ అధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారం ‘కుడా’ కార్యాలయంలో వరంగల్ మునిసిపల్ కా ర్పొరేషన్, కుడా అధికారులతో వివిధ అభివద్ధి పనుల పురోగతి, కొత్త ప్రణాళికపై సమీక్ష సమావేశం నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం...
 
రోప్‌వేలో నిర్లక్ష్యం
భద్రకాళి-పద్మాక్షి-రీజనల్ సైన్స్ సెంటర్ల మధ్య రోప్‌వే నిర్మాణానికి గతంలో ప్రణాళిక రూపొం దించారు. పీపీపీ పద్ధతిలో దీన్ని నిర్మించేందుకు 2007లో ప్రణాళిక సిద్ధమైంది. నగరానికి మణిహారంలా నిలిచే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుం ది. భక్తులు, పర్యాటకులు భద్రకాళి చెరువు మీదుగా పద్మాక్షి గుట్టకు చేరుకుని, అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హంటర్‌రోడ్డులో గుట్టపై నిర్మించిన రీజనల్ సైన్స్ సెంటర్ వరకు రోప్‌వే ద్వారా చేరుకుంటారు.

రీజనల్ సైన్స్ సెంటర్‌ను సందర్శించిన తర్వాత దానికి ఎదురుగా ఉన్న జూపార్కుకు పర్యాటకులు వెళ్లేలా ఓ చక్కని టూరిజం సర్క్యుట్‌లా దీన్ని రూపొందించారు. రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2007లో టెండర్లకు ఆహ్వానించగా... వైజాగ్ రోప్‌వే ప్రాజెక్టు చేసిన కోల్‌కతాకు చెందిన ఓ ప్రవేటు సంస్థ ముందుకొచ్చింది. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. భద్రకాళి చెరువు సమీపంలోనే మ్యూజికల్ గార్డెన్, ప్లానిటోరియం సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా ‘కుడా’ యంత్రాంగం నడుం బిగించాల్సిన అవసరం ఉంది.

హెల్త్ స్పా ఎక్కడ?...
హంటర్ రోడ్డులో ఆర్టీసీ టైర్ కంపెనీ పక్కన ఉన్న నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ‘కుడా’కు అప్పగించారు. ఈ స్థలంలో హెల్త్ స్పాను నిర్మించాలని ప్రతిపాదించారు. పీపీపీ పద్ధతిలో ఈప్రొక్యూర్‌మెంటు విధానంలో టెండర్లు నిర్వహించి, వదిలేశారు. ఈ క్రమంలో ఈ స్థలం  కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. ఆహ్లాదం, ఆధ్యాత్మికం రెండింటిని కలుపుతూ భద్రకాళి చెరువు మధ్యలో రూ. 45 కోట్లలో పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు 2007లో ‘కుడా’ ప్రణాళిక రూపొందించింది. బోట్ల ద్వారా ధ్యాన కేంద్రానికి వెళ్లివచ్చేలా పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా ఈ డిజైన్ రూపొందించింది. దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువును రూ 4.5 కోట్లతో  హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ‘కుడా’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సిద్ధం చేసింది. ఆ తర్వాతా వీటి ఊసు పట్టించుకునే వారే కరువయ్యారు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
అజంజాహి మిల్లు భూముల అమ్మకం ‘కుడా’ ఓ సిటీ వెంచర్ ప్రారంభించింది. దాదాపుగా 60 శాతం స్థలాలు విక్రరుుంచారు. మధ్య తరగతి వర్గాల కోసం హసన్‌పర్తి  మండలం మునిపల్లిలో టౌన్ షిప్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. సూమారు 45 ఎకరాల భూమి ఉంది. నాలుగున్నర ఏళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. హయగ్రీవాచారి మైదానంలో రూ.103 కోట్లతో షాపింగ్ కాంప్లెక్సు నిర్మించేందుకు ప్రతిపాదించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేత శిలాఫలకం వేయించారు. తొమ్మిదేళ్లవుతున్న ఇంత వరకు షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి కాలేదు.
 
ఆరోపణల వెల్లువ
లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం అమల్లో ‘కుడా’ ఖజానాకు భారీగా గండిపడిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.  ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా భూములపై యజమానులకు హక్కు కల్పించే సమయంలో పాత యాజమాన్య  పత్రాలు, మార్కెట్ విలువను తక్కువగా చూపారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కుడా’ పరిధిలో అనుమతులు లేకుండా 60కి పైగా లే అవు ట్లు ఉన్నట్లు అంచనా. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు