కలదో...లేదో!

6 Sep, 2014 03:41 IST|Sakshi
  •      మళ్లీ సర్వే కోసం ఎదురుచూపు
  •      జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు
  •      కుటుంబాల సంఖ్యపై కనిపించని స్పష్టత
  •      రీ ఎంట్రీపై తలలు పట్టుకుంటున్న అధికారులు
  •  సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే మళ్లీ ఉంటుందా? లేదా అని గ్రేటర్‌లోని వివిధ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓవైపు మళ్లీ సర్వే జరిగే తేదీని ప్రకటించకపోవడం...మరోవైపు కంప్యూటరీకరణ ప్రక్రియ మొదలవడం సందేహాలకు తావిస్తోంది. గతనెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను మిగిలిన జిల్లాలతో పాటే గ్రేటర్‌లోనూ ఒక్కరోజులోనే పూర్తి చేశారు.

    అంతవరకు బాగానే ఉంది. కానీ.. తమ వివరాలు సర్వేలో నమోదు కాలేదంటూ ఇంకా ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఎంతలేదన్నా కనీసం లక్షకు తగ్గకుండా ఉంటాయని అంచనా. 2011 జనగణనలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నప్పటికీ 625 చ.కి.మీ. విస్తీర్ణం.. 20 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్న నగరంలో సర్వేకు ఒక్క రోజుసరిపోలేదు.

    19న సర్వే జరిగినప్పటికీ..నేటి  వరకు ఇంకా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. 19న ఎన్యూమరేటర్లు రాలేదని ఫిర్యాదులు చేసిన వారందరి ఇళ్లకు మరుసటి రోజు పంపించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అయినప్పటికీ ఇంకా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ అనేకమంది రోజూ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వేలో నమోదు కాని వారందరికీ అవకాశం కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రెండు వారాలు గడిచిపోయినా నేటికీ సర్వే తేదీ ప్రకటించకపోవడంతో నమోదు కాని కుటుంబాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సర్వే పూర్తయిన ఇళ్ల కంప్యూటరీకరణ పనులు ప్రారంభం కావడంతో సర్వే ఉంటుందో, లేదోనని సందేహిస్తున్నారు.
     
    అంచనాలకు అందని కుటుంబాలు
     
    గ్రేటర్ జనాభాపై అధికారుల అంచనాలు మళ్లీ తప్పాయి. గతనెల 20 వరకు జరిగిన సర్వే వివరాల ప్రకారం దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు ఉండవచ్చునని అంచనా వేశారు. కానీ 2.40 లక్షల కుటుంబాల వారు తమంతట తామే అధికారులకు వివరాలు అందజేశారు.
     
    పూర్తి కాలేదంటూ...
     
    తమ ఇళ్లకు అధికారులెవరూ రాలేదని, తమ ప్రాంతాల్లో సర్వే జరగలేదని బస్తీలు, కాలనీల నుంచి నేటికీ ఫిర్యాదులు అందుతూనే ఉన్నా యి. కర్మన్‌ఘాట్ డివిజన్‌లోని మాధవనగర్, శివగంగ కాలనీ, డైమండ్ కాలనీ, నందనవనం భూపేష్ గుప్తా నగర్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్‌లోని మల్లికార్జున నగర్, శ్రీరామా హిల్స్, శ్రీరాంనగర్, వీకర్‌సెక్షన్ కాలనీ, మధురానగర్, అమ్మదయకాలనీ, సాయి సప్తగిరి కాలనీ, రాక్‌టౌన్, సాయినగర్, బాలాజినగర్ వాసులు సర్వే కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తపేట డివిజన్‌లోని వెంకటరమణ కాలనీ, మమతానగర్, బీకేరెడి ్డకాలనీలలో కేపీహెచ్‌బీ కాలనీ, వివేకానందన గర్‌కాలనీ, మోతీనగర్ ప్రాంతాలలో సర్వే పూర్తి కాలేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.
     
    సంఖ్యపై స్పష్టత కరవు: గ్రేటర్‌లో నిజంగా ఎన్ని కుటుంబాలున్నాయి.. జనాభా ఎంత అనే అంశాలపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. మిగిలిపోయిన కుటుం బాలన్నింటి సర్వే జరిగితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా సర్వేలో పేరు నమోదు కోసం గతనెల 19న   జిల్లాలకు వెళ్లిన వారు సైతం జరగబోయే సర్వేలో తమ పేరు నమోదు చేయించుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీన్ని అధిగమించేదెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు.  
     
    కంప్యూటరీకరణలో జాప్యం
     
    సర్వే పూర్తయిన వివరాల కంప్యూటరీకరణ పనులు నగరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సర్వే చేయాల్సిన కుటుంబాలు 20 లక్షలకు పైగా ఉండటంతో టెండర్ల మేరకు అధిక మొత్తంలో కంప్యూటర్లు, ఆపరేటర్లు కలిగి ఉన్న సంస్థలకు  పనులు అప్పగించడంలో జాప్యం జరిగింది. కంప్యూటరీకరణ పూర్తి కాకముందే మళ్లీ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారోనని పలువురు ఎదురు చూస్తున్నారు.
     
    గత నెల 20 వరకు అందిన సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 20,11,293 కుటుంబాల సర్వే పూర్తయింది. సర్వే పరిధిలోకి రాని కుటుంబాలు మరో 1,49,308 ఉండవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ గత నెల 27 వరకు మరో 2,40,826 కుటుంబాలు సర్వేలో చోటు పొందాయి. మళ్లీ సర్వే కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు కనీసం లక్షకు తగ్గకుండా ఉండవచ్చునని అంచనా.
     

మరిన్ని వార్తలు