‘కాళేశ్వరం’ పనులకు ‘ఎలక్షన్‌’ ఎఫెక్ట్‌

11 Apr, 2019 09:59 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీ 

ఓటు వేయడానికి స్వరాష్ట్రాలకు వెళ్తున్న సిబ్బంది

ఈనెల 20 తర్వాతే తిరిగి వచ్చే అవకాశం

సాక్షి, కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ‘ఎలక్షన్‌’ ఎఫెక్ట్‌ తగిలింది. ఈ ప్రాజెక్టులో పనిచేసేవారు దాదాపు ఇతర రాష్ట్రాల వారే అత్యధికంగా ఉన్నారు. తెలంగాణలో లోక్‌సభకు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్, గ్రావిటీకాల్వల్లో పనిచేస్తున్న సుమారు 40 శాతం మంది ఇంజినీర్లు, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, భారీ యంత్రాల ఆపరేటర్లు, కార్మికులంతా సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఈనెల 14న శ్రీరామనవమి పండుగ రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వారు 16వ తేదీ వరకు, అలాగే ఇతర రాష్ట్రాల కార్మి కులు ఈనెల 20 తరువాత వచ్చే అవకాశం ఉంది. అయితే కొంత మంది బీహార్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన కార్మికులు మాత్రం దూరం ఎక్కువగా ఉండడం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్లలేక పోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్మికులు, ఇంజినీర్లతో పనుల్లో వేగం తగ్గకుండా చేపడతామని కాంట్రాక్టర్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు