ప్యాకేజీ 20.. టార్గెట్‌ 2020..!

5 Jan, 2019 11:13 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నీటి పారుదల శాఖ తాజా లక్ష్యాలను నిర్దేశించుకుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పూర్తయ్యే లోపు దానికి అనుసంధానమైన జిల్లా పరిధిలోని కాళేశ్వరం 20వ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల ప్రగతిపై ఇటీవల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఇందులో భాగంగా జిల్లా సరిహద్దుల్లో ఉన్నరాజేశ్వర్‌రావుపేట్‌లోని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం రెండో పంప్‌హౌజ్‌ పనులను సైతం సందర్శించారు. ఆయా ప్రాజెక్టుల ప్రగతిపై కూడా ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం విధితమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జిల్లాలో 20వ ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. సుమారు తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్యాకేజీకి సంబంధించి నీటి పారుదల శాఖ తాజాగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2019 డిసెంబర్‌ చివరి వరకు ఈ పనులను పూర్తి చేయాలని భావిస్తోంది.

ఇవీ పనులు.. 

  • నవీపేట్‌ మండలం బినోల వద్ద ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ను మాసాని చెరువు వరకు ఎత్తిపోసుకునే పనులు 20వ ప్యాకేజీ పరిధిలో ఉన్నాయి.  
  • రూ.892.67 కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ పనులను ఐవీఆర్‌సీఎల్, బీఏటీపీఏఎస్‌సీఓడబ్ల్యూపీఐఎల్, ఎంహెచ్‌ఐ అనే మూడు కంపెనీలు జాయింట్‌ వెంచర్‌లో  చేస్తున్నాయి.  
  • అప్రోచ్‌ చానెల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌజ్‌ నిర్మిస్తున్నారు. ఎలక్ట్రో, హైడ్రో మెకానికల్‌ పనులు కూడా వీటి పరిధిలోనే ఉన్నాయి.  
  • ఈ పనుల కోసం అవసరమైన 832 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేశారు. సుమారు తొమ్మిదేళ్లుగా ఈ పనులు కొనసాగుతున్నాయి.  

ప్రధానంగా టన్నెల్‌ నిర్మాణం.. 
ఈ ప్యాకేజీలో టన్నెల్‌ నిర్మాణం పనులు ప్రధానమైనవి. 17.8 కిలోమీటర్ల మేరకు టన్నెల్‌ నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 16.9 కి.మీ. మేరకు తవ్వకం జరిగింది. ఇంకా 830 మీటర్లు తవ్వకం జరగాల్సి ఉంది. ఈ పనులను ఈ ఏడాది మే నాటికి పూర్తిచేసేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చేపట్టింది. ఈ టన్నెల్‌ లైనింగ్‌ పనులు మాత్రం డిసెంబర్‌ వరకు చేయాలని నిర్దేశించుకుంది. పంప్‌హౌజ్‌ తవ్వకం దాదాపు పూర్తికాగా, లైనింగ్‌ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సర్జ్‌పూల్‌ను జూన్‌ నాటికి, అర కిలోమీటరు పెండింగ్‌లో ఉన్న అప్రోచ్‌ చానెల్‌ను మరో ఐదు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాలువ నిర్మాణం కూడా డిసెంబర్‌ వరకు గడువు పెట్టుకున్నారు. మొత్తం మీద ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులయ్యేలోగా, ఈ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
 
75శాతం పనులు పూర్తయ్యాయి  కాళేశ్వరం ప్రాజెక్టు 
20వ ప్యాకేజీకి సంబంధించి 75 శాతం పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌజ్‌ నిర్మాణంలో భాగంగా పంపులను బిగిస్తున్నారు. టన్నెల్‌ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇంకా ఎనిమిది వందల మీటర్లు జరగాల్సి ఉంది. ఈ ప్యాకేజీ పనులు వీలైనంత త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక దృష్టి సారించాం. –ఆత్మారాం, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్,

మరిన్ని వార్తలు