‘మేడిగడ్డ’లో పెరిగిన ముంపు!

12 Feb, 2020 05:00 IST|Sakshi

బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు

ప్రస్తుతం 14 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

తెలంగాణ, మహారాష్ట్రలోని పంట చేలలోకి చేరుతున్న నీరు

కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిధిలో ముంపు మరింతగా పెరిగింది. ఈ బ్యారేజీకి ఆనుకుని ప్రవహించే ప్రధానమైన నాలుగు పిల్ల వాగులు గోదావరిలో కలిసే చోట కరకట్టల నిర్మాణం జరగలేదు. దీంతో పంట చేన్లలోకి నిల్వ నీరు బ్యాక్‌ వాటర్‌ రూపంలో చేరుతోంది. తెలంగాణ, మహారాష్ట్రంలో వందల ఎకరాల్లో పంట నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్‌ 21 నుంచి లక్ష్మీ బ్యారేజీలోని 85 గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రాణహిత ద్వారా వచ్చే నీటిని బ్యారేజీ వద్ద ఒడిసి పడుతున్నారు. ప్రాణహిత ద్వారా 2,200 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. లక్ష్మీ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా.. మంగళవారం సాయంత్రం వరకు 14 టీఎంసీలకు చేరింది. బ్యారేజీలో ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 99 మీటర్ల వరకు చేరగా ఈనెల 14లోగా 100 మీటర్లకు చేర్చి పూర్తి సామర్ధ్యంతో నీటిని నిల్వ చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వర్షాకాలంలోనే..
గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో కురిసి భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి మట్టం 7.5 టీఎంసీల వరకు మాత్రమే నిలిపారు. అప్పుడు పాణహిత, గోదావరి ద్వారా వచ్చే వరద ప్రవాహంతో పాటు వర్షాలు కురుస్తుండటంతో బ్యాక్‌ వాటర్‌ మొత్తం ఇరురాష్ట్రాల్లోని బ్యారేజీ సరిహద్దులోని పంట చేలలోకి చేరాయి. అప్పుడు ఇంజనీరింగ్‌ అధికారులు బ్యారేజీలోని 85 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. ఆ సమయంలో రోజుకు 3 లక్షల నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వృథాగా తరలిపోయింది.

తెలంగాణ, మహారాష్ట్రాలలో పంట నష్టం
మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో నిర్మించారు. గోదావరి అవుతలి వైపు1.6 కిలోమీటర్ల దూరం వరకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి ఒడ్డుపైకి మేడిగడ్డ బ్యారేజీ వ్యాపించి ఉంది. ఈ నిర్మాణం కోసం మండలంలోని అంబట్‌పల్లిలో 698 ఎకరాలు, మహారాష్ట్ర వైపున 568 ఎకరాల వరకు భూసేకరణ చేసి రైతులకు పరిహారం అందజేశారు. ప్రస్తుతం నవంబర్‌ 21 నుంచి మేడిగడ్డ గేట్లు పూర్తిగా మూసివేయడంతో బ్యాక్‌వాటర్‌ నిల్వ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో రోజుకు 0.2 టీఎంసీ చొప్పున నీరు పెరుగుతోంది. ప్రస్తుతం మేడిగడ్డలో 14 టీఎంసీల నీరు చేరడంతో పంట చేనుల్లోకి నీరు అధికంగా చేరిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహదేవపూర్‌ మండలంలో ఇంజనీరింగ్‌ అధికారులు పంట నష్టంపై సర్వే చేపట్టారు.

రైతులు అధైర్యపడొద్దు 
కాళేశ్వరం ప్రాజెక్టులోనే కీలకమైనది మేడిగడ్డ బ్యారేజీ. ఇందులో పూర్తి 100 ఎఫ్‌ఆర్‌ఎల్‌ నీరు నిల్వ చేసేందుకు టెస్టింగ్‌ చేస్తున్నాం. వర్షాకాలంలో పూర్తి సామర్థ్యం చూడలేం. ఇప్పుడు సాధ్యమైంది కనుక బ్యారేజీలో 100 ఎఫ్‌ఆర్‌ఎల్‌ వరకు నీరు చేరితే ఎంత వరకు ముంపునకు గురవుతుందనేది సర్వే ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో 190, మహారాష్ట్రలో 40 ఎకరాల్లో పంట నష్టం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఆయా రైతులకు పరిహారం చెల్లిస్తాం. ముంపు భూములను తీసుకోవడానికి కూడా సీఎం అనుమతి తీసుకున్నాం. మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లోని రైతులు అధైర్యపడొద్దు.
– నల్ల వెంకటేశ్వర్లు, కాళేశ్వరం బ్యారేజీ ఈఎన్‌సీ

బ్రాహ్మణపల్లిలో నీట మునిగిన మిర్చి పంటను చూపుతున్న రైతు 

మరిన్ని వార్తలు