వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా.. ‘కాళేశ్వరం’ పూర్తి

23 May, 2017 02:12 IST|Sakshi
వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా.. ‘కాళేశ్వరం’ పూర్తి

► బ్యారేజీలు పూర్తిచేసి కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి ఎస్సారెస్పీ ద్వారా నీళ్లందించాలి: సీఎం కేసీఆర్‌
► రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాక ముందే కాల్వల ద్వారా చెరువులు నింపాలి
► ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలి
► చివరి ఆయకట్టుకు నీరివ్వాలి.. సొరంగ మార్గం, ఇతర పనులపై సంతృప్తి
► సాగునీటికి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించాలని ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. బ్యారేజీ నిర్మాణాలకు ముందే కన్నెపల్లి పంప్‌హౌజ్‌ ద్వారా నీటిని తోడాలని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సారెస్పీ, ఇతర కాల్వల ద్వారా సాగునీటి అవసరాలకు, గ్రామాల్లోని చెరువులకు నీరందించాలని ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎక్కడికక్కడ సమాంతరంగా, వేగంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు ఉన్న మార్గంలో 81 కిలోమీటర్ల మేర ఆసియాలోనే పెద్దదైన సొరంగ మార్గం తవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే 78.55 కి.మీ. మేర తవ్వకం పూర్తి కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేసి, రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందివ్వాలని కోరారు. ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాకముందే కాల్వల ద్వారా చెరువులు నింపే పని జరగాలని కోరారు. నీటి పారుదల ప్రాజెక్టులపై సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ఆరు గంటల పాటు సాగిన ఈ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, జల వనరుల నిర్వహణ కమిటీ చైర్మన్‌ వి.ప్రకాశ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈలు వెంకటేశ్వర్లు, హరిరామ్, అనిల్, శంకర్, నాగేందర్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, వాటి నిర్మాణ దశలపై అధికారులతో సీఎం కూలంకశంగా చర్చించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలను పెట్టి, వాటిని ప్రగతిభవన్‌కు అనుసంధానం చేశారు. ఆ పనులను ప్రగతి భవన్‌ నుంచే సీఎం వీక్షించారు.

సమన్వయంతో ముందుకెళ్లాలి..
ప్రాజెక్టుల పనుల విషయంతో అత్యంత వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు. ‘‘వర్షాలు లేనప్పుడు ఏ పనులు చేయాలి? వర్షాలున్నప్పుడు ఏ పనులు చేయాలి? వరదలు వస్తే ఎలా వ్యవహరించాలి? అనే విషయంలో ప్రత్యేక కార్యాచరణలు రూపొందించుకోవాలి. బ్యారేజీలు, ఇన్‌టేక్‌ వెల్స్, పంప్‌ హౌజ్‌ల నిర్మాణం జరుగుతుండగానే గేట్లు, పంపుల తయారీ, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, లైన్ల నిర్మాణం సమాంతరంగా జరగాలి. ఎక్కడికక్కడ పనులు సమాంతరంగా చేస్తూ.. అంతిమంగా అన్నింటినీ లింక్‌ చేయాలి. ఒకదాని తర్వాత ఒక పని చేద్దామని భావన ఉండొద్దు.

వర్కింగ్‌ ఏజెన్సీల పనిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వారు కావాల్సిన పనులను సకాలంలో చేస్తున్నారో లేదో కూడా గమనించాలి. విద్యుత్‌ అధికారులతో కూడా సమన్వయం ఉండాలి. కాళేశ్వరం నుంచి ఎల్‌ఎండీ దాకా ఎన్ని పంపులు పెడుతున్నాం? ఎంత కరెంటు కావాలి? అనే విషయాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఏర్పాట్లు చేసుకోవాలి. కాళేశ్వరానికి ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపులను ఆస్ట్రియాలో తయారు చేయిస్తున్నం. అక్కడికి వెళ్లి వాటి నిర్మాణాన్ని పరిశీలించి, వాటి పనితీరుపై అక్కడి తయారీ సంస్థలు, నిపుణులతో చర్చించి నిర్వహణ అంశాలపై అవగాహన పెంచుకోవాలి’’అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఎల్లంపల్లి–మిడ్‌ మానేరు లింక్‌ పూర్తవ్వాలి
కాళేశ్వరం పనులు జరుగుతుండగానే అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు వరకు గోదావరి నీటిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ‘‘ఇప్పటికే సిద్ధంగా ఉన్న కాల్వలను వాడుకోవాలి. ఎల్‌ఎండీకి ఎగువన ఉన్న సరస్వతి, లక్ష్మి కాల్వలు, ఎల్‌ఎండీకి దిగువన ఉన్న కాకతీయ కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయాలి. నీటి ప్రవాహ సామర్థ్యం పెంచాలి. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కాల్వల ద్వారా నీళ్లు పంపాలి. చెరువులు నింపాలి. ఈ నీళ్లను చివరి ఆయకట్టు వరకు పంపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాళేశ్వరం దగ్గర పుష్కలమైన నీటి లభ్యత ఉంది.

దాన్ని సమర్థంగా వాడుకోవాలి. దేవాదులను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే దానిపై 8 వేల కోట్లు ఖర్చు చేశారు. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి గోదావరిపై బ్యారేజీ కూడా నిర్మిస్తున్నాం. దేవాదులపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి, ఇంకా ఏం చేయాలో నిర్ణయించాలి. సిద్దిపేట సమీపంలోని ఇమాంబాద్‌లో 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలి. 8.5 కి.మీ. పొడవున్న ఈ రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి అంచనాలు రూపొందించాలి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

చెరువులు నింపేందుకు కార్యాచరణ
గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లు కట్టడానికన్నా ముందే ఆ మార్గంలో కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ‘‘మల్లన్నసాగర్, గంధమల్ల, బస్వాపూర్, కొండపోచమ్మ పరిధిలోని చెరువులను నింపాలి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని బట్టి లిఫ్టులను వాడాలి. సింగూరుకు లిఫ్టులు పెట్టి నారాయణ ఖేడ్, జహీరాబాద్‌కు నీళ్లు పంపాలి. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను నిర్మించాలి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు చెరువులు నింపడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి’’అని చెప్పారు.

‘‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది. రాష్ట్ర బడ్జెట్‌ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి పెట్టుబడులు ఎక్కువ చేసుకుందాం. రైతులకు సాగునీరు అందించడానికి అవసరమైతే రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లులు కట్టడానికి కూడా తెలంగాణ రాబోయే కాలంలో సిద్ధంగా ఉంటుంది. సాగునీటి రంగానికి సంబంధించి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించాలి’’అని సీఎం చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థినితో ఇన్విజిలేటర్‌ అనుచిత ప్రవర్తన 

పేద విద్యార్థులకు విదేశీ విద్య

బేగంపేట్‌.. c\o వీఐపీ ఎయిర్‌పోర్ట్‌

ఇన్‌స్పెక్టర్ల బదిలీలపై ‘లీకుల’ ఎఫెక్ట్‌! 

యురేనియంపై యుద్ధం రగులుకుంది..!

కేయూలో నకిలీ కలకలం

‘విమానాశ్రయం’పై ఉత్కంఠ.!

టేక్మాల్‌ మార్కెట్‌లో దొంగల హల్‌చల్‌

రూటు మారిన విమానాశ్రయం 

గ్రహణం వీడేనా..?

దండం పెడ్తాం.. మా ఉద్యోగాలు కాపాడండి

అంబులెన్స్‌ డోర్‌ ఎంతపని చేసింది!

డాల్ఫినో డాల్‌..

త్వరలో పాలమూరుకు సీఎం

‘మినీ’ని సుందరంగా తీర్చిదిద్దుతాం

బల్దియాపై ‘నజర్‌’

ఏసీబీకి చిక్కిన భగీరథ బకాసురులు

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతతో తీవ్ర ఇబ్బందులు  

దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానం

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

ఇక ‘మీ సేవలు’ చాలు

‘నల్లమల సందర్శనకు అనుమతించండి’ 

నడ్డా తెలియకపోవడం విడ్డూరం: దత్తాత్రేయ 

హెచ్‌సీయూలో ఉద్రిక్తత 

రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

నేడు, రేపు రాష్టంలో మోస్తరు వర్షాలు 

రాష్ట్రంలో కార్లు, బైక్‌ల దూకుడు

చెరువు ఎండిపాయే..

కృష్ణమ్మ తియ్యగా..గోదావరి చప్పగా..! 

మల్టీ‘ఫుల్‌’ చీటింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను