ప్రాజెక్టులో ఒక్కో ఆటంకాన్ని తొలగిస్తూ ముందుకు..

21 Jun, 2019 12:42 IST|Sakshi
2017 డిసెంబర్‌ 4న గ్రావిటీ కాల్వ పనుల ప్రాంతంలో అటవీశాఖ అధికారులతో మాట్లాడుతున్న ఇంజినీర్లు(ఫైల్‌)

ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణకు కొత్త చట్టం అమలు

సమష్టిగా పని చేసిన ఇంజనీర్లు, కార్మికులు

సాక్షి, కాళేశ్వరం (వరంగల్‌): మూడు బ్యారేజీలు, పంతొమ్మిది రిజర్వాయర్లు, టన్నెళ్లు, నీటి కాల్వలు, సుమారు ఐదువేల మెగావాట్ల విద్యుత్‌ వాడకం.. వీటన్నింటి సమాహారంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రకటించినప్పుడు పెదవి విరిచినవారే ఎక్కువ. ప్రాణహిత నీటిని ఒడిసి పట్టి గోదావరి నది ప్రవాహానికి ఎదురెళ్లి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నింపడం అనే కాన్సెఫ్ట్‌తో ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఇది సాధ్యమేనా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు.

ఒక్క బ్యారేజీ.. దానికి అనుగుణంగా కాల్వల నిర్మాణంతో కూడిన సాగునీటి ప్రాజెక్టులే పూర్తి కావడానికి దశాబ్దాలు సమయం పడుతుంటే ఇంత భారీ ప్రాజెక్టు పట్టాలపైకి వచ్చేనా.. ఒకవేళ వచ్చినా పూర్తి కావడానికి ఎన్ని తరాలు పడుతుందో అనే అపనమ్మకాలు ముసురుకున్నాయి. అయితే, అనుమానాలు, అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ మూడేళ్లలో తొలి ఫలితాలు అందించేందుకు సగర్వంగా సిద్ధమైంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం.

తొలి సమస్య భూసేకరణ
సాగునీటి ప్రాజెక్టులు ఎదుర్కొనే ప్రధాన సమస్య భూసేకరణ. ముంపు ప్రాంతాల్లో భూమి సేకరించడం సవాల్‌గా మారుతోంది. అయితే, ఈ ప్రాజెక్టును మాత్రం ముంపు, నిర్వాసితుల సంఖ్యను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా డిజైన్‌ సిద్ధం చేశారు. ఫలితంగా గోదావరి ప్రవాహంలోనే నీటిని నిల్వ చేసేలా మూడు బ్యారేజీలకు రూపకల్పన చేశారు. నీటి ముంపు లేకుండా కేవలం నిర్మాణ ప్రదేశాల్లోనే భూమిని సేకరించారు. ఈ క్రమంలో భూసేకరణ చట్టం 2013 స్థానంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీడో 123 కొంత వివాస్పదమైనా వేగంగా భూసేకరణ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసేందుకు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఇలా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సీఎం స్థాయి అత్యున్నత వ్యక్తులు శ్రమించడం వల్ల సకాలంలో భూమి సేకరించి పనులు పూర్తి చేశారు.

త్వరత్వరగా అనుమతులు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిత స్థలం దట్టమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు, ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు కాలువలు, కరెంటు టవర్లు నిర్మించేందుకు ఒక్క జయశంకర్‌ భూపా లపల్లి జిల్లా పరిధిలోనే 330 హెక్టార్ట అటవీ స్థలాన్ని సేకరించాల్సి వచ్చింది. రోడ్డు విస్తరణ పనులకే అనుమతులు రావడం కష్టమంటే కాల్వలు, విద్యుత్‌ లైన్లకు అవసరమైన అటవీశాఖ భూములను సేకరించాలంటే ఎంత సమస్యో చెప్పాల్సిన అవసరంలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పని చేసింది. ఢిల్లీ స్థాయిలో వెంటపడి నెలల వ్యవధిలోనే అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు సాధించింది.

యంత్రాల రవాణాలో..
తక్కువ కాలంలో భారీ ప్రాజెక్టును నిర్మించాల్సి రావడంతో భారీ యంత్రాల అవసరం ఏర్పడింది. ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, జపాన్‌ దేశాల ద్వారా మెటార్లు, రోటార్లు తీసుకువచ్చారు. మొదటి మోటార్‌ పంపులు రావడానికి 52 రోజులు పట్టింది. ఆ తర్వాత రూట్‌ క్లియరెన్స్‌ కావడంతో త్వరగా 20–30 రోజుల్లో తీసుకురాగలిగారు. ఆ మోటార్లను తీసుకొచ్చే కంటెయినర్లు రోజుకు 20–25 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసేది. ప్రధానంగా వరంగల్‌ నుంచి కాళేశ్వరం వరకు రోడ్డు ఫర్వాలేదు అనేలా ఉన్నా మహదేవపూర్‌ నుంచి మేడిగడ్డ, మహదేవపూర్‌ క్రాస్‌ నుంచి అన్నారం వరకు ఇరుకైన రహదారులు ఉన్నాయి.

వీటి గుండా భారీ యంత్రాలను తరలించడం ఎంతో కష్టమైన పనిగా మారింది. దేశంలో వివిధ పోర్టులకు వచ్చిన భారీ యంత్రాలను భారీ వాహనాల ద్వారా ఇరుకైన రోడ్డు, మూలమలుపులు మధ్య పని ప్రదేశాలకు చేరవేసేందుకు ఎంతో శ్రమకోర్చాల్సి వచ్చింది. ఈ యంత్రాల రవాణా కారణంగా అనేక సార్లు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినా, తమ గ్రామాల్లో రోడ్లు పాడైనా... బొమ్మాపూర్, ఎలికేశ్వరం, బెగ్లూర్, సూరారం, కన్నెపల్లి గ్రామ ప్రజలు తమ వంతు సహకారం అందించారు.

లారీల సమ్మెతో..
2018లో చేపట్టిన లారీల సమ్మె కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభావం చూపలేకపోయింది. ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు నిర్మాణ కంపెనీలు నెల రోజులకు సరిపడా సిమెంట్, స్టీలు స్టాకు, కంకర లోడ్ల నిల్వ ఉంచుకోవడంతో సమ్మె ఎఫెక్ట్‌ నుంచి తప్పించుకోగలిగింది. మరో పది రోజుల పాటు సమ్మె కొనసాగి ఉంటే పనులు బ్రేక్‌ పడేదేమో! కానీ రెండు వారాలకు పైగా కొనసాగిన సమ్మె ఆగిపోవడంతో ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపకపోవడంతో ఏజెన్సీలు ఊపిరి పీల్చుకున్నాయి.

భద్రత
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దులో ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో భారీ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మావోయిస్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు నిరంతరం రక్షణ అందించాయి. గోదావరికి ఇవతలి తీరంవైçపు భారీయంత్రాలు, వేలాది మంది కార్మికులు ఆటంకాలు లేకుండా పని చేయగలిగారు. ఇదే సమయంలో గోదావరికి అవతలి వైపు సిరంచలో కలప డిపోను, గడ్చిరోలి జిల్లాలో మరోనాలుగైదు చోట్ల పనులు జరుగుతున్న ప్రాంతంలో టిప్పర్లు, ప్రొక్లెయిన్లను మావోయిస్టులు దహనం చేశారు.

గోదావరి అవతలి తీరంలో అలజడి ఉన్నా ఇవతలవైపు ఆ ప్రభావం లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గతేడాది ఏప్రిల్‌లో ఏకంగా మావోయిస్టులు 40మందిని ఎన్‌కౌంటర్‌లో పోలీసులు మట్టుపెట్టారు. దీనికి ప్రతీకారంగా రెండు నెలల కిందట 16మంది పోలీసులపై గడ్చిరోలి దగ్గర బాంబుపెట్టి వాహనాన్ని పేల్చారు. కాగా ఇటు వైపు మాత్రం ఎలాంటి హింసా సంఘటనలు లేకుండా సజావుగా నిర్మాణ పనులు జరిగాయి.

ప్లాన్‌లో లేని పెద్దవాగు..
కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అన్నారం బ్యారేజీ వరకు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్‌కు పెద్దవాగుతో సమస్య ఎదురైంది. మానవ నిర్మితమైన గ్రావిటీ కెనాల్‌ ప్రవాహానికి, సహజ ప్రవాహమైన పెద్ద వాగు అడ్డుగా వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు సహజసిద్ధమైన పెద్దవాగు ప్రవాహాన్ని మళ్లించాల్సి వచ్చింది. గ్రావిటీ కెనాల్‌కు అడ్డు రాకుండా ప్రవాహ దిశను మార్చి అన్నారం బ్యారేజీ దిగువన పెద్ద వాగు కలిసేలా కొత్తగా మానవ నిర్మిత వాగు ఏర్పాటు చేశారు. ఇలా అడ్డంకులు, అవాంతరాలకు అధిగమించి ప్రభుత్వం.. ప్రాజెక్టును శుక్రవారం ప్రారంభిస్తోంది.

>
మరిన్ని వార్తలు