సాహో.. బాహుబలి

12 Aug, 2019 09:50 IST|Sakshi
గ్రావిటీ కెనాల్‌ ద్వారా వరద కాలువలోకి చేరుతున్న గోదావరి నీరు 

 లక్ష్మీపూర్‌లో భారీ  మోటార్ల వెట్‌రన్‌ షురూ 

ఐదో మోటార్‌ రన్‌  విజయవంతం 

40 నిమిషాలు   నడిపిన అధికారులు  

సాక్షి, రామడుగు(కరీంనగర్‌) :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరోఘట్టం ఆవిష్కృతమైంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద  నిర్మించిన సర్జిపూల్‌లో ఐదో మోటార్‌ వెట్‌రన్‌ విజయవంతంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం రిజర్వాయర్‌ నుంచి ఇంజినీరింగ్‌ అధికారులు గత సోమవారం ఎల్లంపల్లి నీటిని ప్యాకేజీ–8 పంప్‌హౌస్‌లకు వదిలారు. రాత్రి 9 గంటలకు సర్జిపూల్‌కు నీరు చేరింది. సర్జిపూల్, టన్నల్‌కు సరిపడా నీరు చేరిన తర్వాత నీటి విడుదలను నిలిపివేశారు.  

పరీక్షల అనంతరం.. 
లక్ష్మీపూర్‌ టన్నల్‌తోపాటు, సర్జిపూల్, మోటార్లు, సబ్‌స్టేషన్‌ నుంచి మోటార్లుకు పంపించే విద్యుత్‌ తీగల్లో సాంకేతిక సమస్యలను ఇంజినీరింగ్‌ అధికారులు పరీక్షించారు. లీకేజీలకు మరమ్మతులు చేశారు. టెక్నికల్‌ టెస్ట్‌ నిర్వహించారు. చిన్నచిన్న లోపాలు సవరించారు. అన్నీ పరీక్షలు పూర్తిచేసిన తర్వాత శనివారం సాయంత్రం నుంచి ఎల్లంపల్లి నీటిని టన్నెల్‌ ద్వారా లక్ష్మీపూర్‌ సర్జిపూల్‌కు విడుదల చేశారు. నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతోంది.  

నిజంగా బాహుబలే.. 
ఆదివారం సాయంత్రం ఐదో మోటార్‌కు అధికారులు వెట్‌రన్‌ నిర్వహించారు. 5:30 గంటలకు అధికారులు మోటార్‌ ఆన్‌చేశారు. పది నిమిషాల తర్వాత సుమారు 117 మీటర్ల ఎత్తలో ఉన్న సిస్టర్న్‌ ద్వారా గంగమ్మ ఉబికి వచ్చింది. దీంతో అధికారులు ఆనందంలో మునిగిపోయారు. వెట్‌రన్‌ కోసం ఉదయం నుంచి శ్రమించిన అధికారులు విజయవంతం కావడంతో సంతోషంలో మునిగిపోయారు. ఒక్క మోటార్‌ వెట్‌రన్‌తోనే సిస్టర్న్‌ వద్ద నీరు భారీ వరదను తలపిస్తూ నిజంగా బాహుబలి మోటారే అని స్థానికులు చర్చించుకున్నారు. మోటారును దాదాపుగా 40 నిమిషాలు వెట్‌రన్‌ నిర్వహించారు. ఈ పంపు ద్వారా సుమారు వంద క్యూసెక్కుల నీళ్లు పంపింగ్‌ జరిగింది. ఈనీరు లక్ష్మీపూర్‌ నుంచి 5.77 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి శ్రీరాములపల్లి గ్రామ శివారులో ఉన్న వరదకాలువలో చేరింది. వరద కాలువ నుండి మరో రెండు కిలోమీటర్ల మేర నీరు చేరిందని శ్రీరాములపల్లి గ్రామ రైతులు తెలిపారు.  

మొత్తం ఏడు మోటార్లు.. 
లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌లో మొత్తం ఏడు మోటార్లు ఉండగా, వీటిలో ఇప్పటికి ఐదు మోటార్లు డ్రైరన్‌ చేశారు. తాజాగా అదివారం ఒక మోటారు వెట్‌రన్‌ విజయంతంగా నిర్వహించారు. దశవారీగా మొత్తం మోటార్ల ద్వారా వెట్‌రన్‌ చేయడానికి అధికారుల సిద్ధమవుతున్నారు. సోమవారం మరో రెండు మోటార్లకు వెట్‌రన్‌ చేయడానికి ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

రైతుల్లో ఆనందం..  
లక్ష్మీపూర పంపుహౌస్‌లో బాహుబలి మోటార్‌కు వెట్‌రన్‌ నిర్వహించిన విషయం తెలియడంతో మండలంలోని రామడుగు, లక్ష్మీపూర్, దత్తోజీపల్లి, గుండి, రాంచెంద్రాపూర్, చిప్పకుర్తి, గోపాల్‌రావుపేట, శ్రీరాములపల్లి, తిర్మలాపూర్‌ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు కాలువ ద్వారా వెళ్లే నీటిని చూడడం కోసం పరుగులు తీశారు. కాలువలో నీరుపారుతున్న దృశ్యం చూసి ఆనందం వ్యక్తం చేశారు.   

వెట్‌రన్‌పై జాగ్రత్తలు.. 
ఆదివారం సాయంత్రం అధికారులు వెట్‌రన్‌ చేయడానికి ముందు అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. పంపుహౌస్‌ పరిసరాలలోకి కనీసం మీడియాను కూడా అనుమతిలేదు. పంపుహౌస్‌ వద్దకు వెళ్లిన మీడియా వాళ్లను పంపించివేశారు. అంతేకాకుండ ఆ చుట్టు పక్కల కూడా ప్రజలు , రైతులు లేకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. నీరు కాలువలోకి రావడంతో విషయం తెలుసుకున్న ప్రజలు, రైతులు ఒక్కసారి పంపుహౌస్‌ పరిసరాలకు చేరుకుని సంతోషం పంచుకున్నారు.  

రెండుమూడు రోజుల్లో ఎత్తిపోత..  
భూగర్భంలో దాదాపుగా 140 మీటర్ల లోతులో ఉన్న  ఐదు భారీ విద్యుత్‌ మోటార్లు(బహుబలులు) ద్వారా  అధికారులు రెండు లేదా మూ డు రోజులల్లో నీటి పంపింగ్‌ చేయడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. 8వ ప్యాకేజీలో ఉన్న ఐదు భారీ మోటార్లుతో నీటిని పంపింగ్‌ ప్రక్రియ చేయడానికి ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. బహుబలి విద్యుత్‌ మోటార్లు నిత్యం 117 మీటర్ల ఎత్తులో ఉన్న కాలువలోకి నీటిని పంపింగ్‌ చేయనున్నారు.  

ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌కు.. 
వరద కాలువ నుంచి గోదావరి నీరు ఓవైపు మిడ్‌ మానేరుకు, మరోవైపు ఎస్సారెస్పీ ప్రాజెక్టు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా తరలించే అవకాశం ఉంది. వరదకాలువలో నీరు నిల్వస్థాయికి చేరుకోగానే జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ వద్ద ఏర్పాటు చేసి రివర్స్‌ పంపింగ్‌ విధానంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీటిని పంపింగ్‌ చేస్తారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా