21న కాళేశ్వర ‘తీర్థం’

13 Jun, 2019 01:45 IST|Sakshi

మేడిగడ్డ బ్యారేజీ వద్ద, గోదావరి చెంత జల సంకల్ప మహాయాగం

తర్వాత మోటార్లను ఆన్‌ చేసి ఎత్తిపోతలకు శ్రీకారం 

ఈ సీజన్‌లో 150 టీఎంసీల ఎత్తిపోత... రూ.50 వేల కోట్లకు చేరువైన వ్యయం

ప్రారంభోత్సవానికి ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వైఎస్‌ జగన్, ఫడ్నవిస్‌కు ఆహ్వానం

త్వరలో విజయవాడ, ముంబైలకు వెళ్లి స్వయంగా ఆహ్వానించనున్న కేసీఆర్‌

ఆ రోజునే ప్రాజెక్టు ఎత్తిపోతలకు నాంది పలకనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రానికి వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలకనుంది. తెలంగాణ భూ భాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమల అవసరాలను తీర్చే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగానే అక్కడే జల సంకల్ప మహాయాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ని ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. గోదావరిలో వరద ఉండే దినాలను బట్టి కనిష్టంగా 150 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి, రూ.50 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేసి పనులు పూర్తి చేసింది.  

ఏటా 80 లక్షల ఎకరాల్లో పంట... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. కొత్తగా ఆయకట్టు సాగులోకి వచ్చే జిల్లాల్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలున్నాయి. కాళేశ్వరం నీటితోనే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కూడా నీరందివ్వనున్నారు. దీంతో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 40 లక్షల ఎకరాలకు ప్రతీ ఏడాది 2 పంటలకు నీరందనుండగా, ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలవబోతోందని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.  


రాత్రింబవళ్లు పనులు.. పూర్తయిన నిర్మాణాలు.. 
కాళేశ్వరం పథకానికి 2016, మే 2న కన్నెపల్లి వద్ద ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. 12 బ్లాకుల్లో 1,531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు ఇప్పటికే పూర్తవగా, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు గానూ 8 మోటార్లు సిద్ధమయ్యాయి. మిగతా వాటి పనులు సాగుతున్నాయి.

అన్నారంలో 8కి గానూ 5, సుందిళ్లలో 9కిగానూ 6 సిద్ధం చేశారు. ఇందులో మేడిగడ్డ పంపులను ఈ నెల 21న కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించి గోదావరి నీటి ఎత్తిపోతలకు అంకురార్పణ చేయనున్నారు. రెండు లేక మూడు మోటార్లతో 21 నుంచి మేడిగడ్డను ఆరంభించి అన్నారానికి నీటిని తరలించాలని, అక్కడ 4.47 టీఎంసీల నిల్వకు రాగానే, రెండు మోటార్లతో 28 నుంచి అన్నారం ఎత్తిపోతలను ఆరంభించి సుందిళ్లకు నీటిని తరలించాలని, అక్కడ 4.25 టీఎంసీల నిల్వకు చేరగానే, వచ్చే నెల 5 నుంచి 3 మోటార్లను ఆరంభించి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా, ఇందులో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్‌కు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యమున్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే 4 రెడీ అయ్యాయి. ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. లైనింగ్‌ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యమున్న బాహుబలి మోటార్‌ పంపులు 5 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను మరో 15–20 రోజుల్లో సిద్ధం చేయనున్నారు.

ఇక మిడ్‌మానేరు కింద కొండపోచమ్మసాగర్‌ వరకు ప్యాకేజీ–10, 11, 12, 13, 14 ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్నాయి. ఇందులో చాలా ప్యాకేజీల్లో మోటార్ల బిగింపు ప్రక్రియ లక్ష్యాల మేరకు పూర్తయింది. ఈ ఖరీఫ్‌లో కొండపోచమ్మసాగర్‌ వరకు 150 టీఎంసీల మేర నీటిని ఈ సీజన్‌లో తరలించేలా పనులు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్‌ వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అర కిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. 

తొలి ఫలితం ఎస్సారెస్పీకే... 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా లబ్ధి పొందనున్న తొలి ఆయకట్టు ఎస్సారెస్పీదే కానుంది. ఎల్లంపల్లి మిడ్‌మానేరుకు తరలించే నీటిని వరద కాల్వపై నిర్మస్తున్న ఎస్పారెస్పీ పునరుజ్జీవన పథకంలోని లిఫ్టుల ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్‌–1 కింద 9.68 లక్షలు, స్టేజ్‌–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను దాటుకొని నీరు ఎల్లంపల్లి మీదుగా వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు చేరుతుంది. అయితే మిడ్‌మానేరుకు చేరకముందే వరద కాల్వ మీద మూడు పంప్‌హౌజ్‌లను నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద ఉండే 60 నుంచి 120 రోజుల పాటు ఎస్సారెస్పీకి పంపిస్తారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్‌హౌజ్‌లకు గానూ రెండు పంప్‌హౌజ్‌లలో సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పంప్‌హౌస్‌ల్లో 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగేసి చొప్పున పంపులను జూన్‌ చివరికి పూర్తి చేసి, జులై నుంచి ఖరీఫ్‌లో కనిష్టంగా 60 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించనున్నారు. ఈ నీటికి ఎస్సారెస్పీకి సహజ ప్రవాహాలతో వచ్చే మరో 30 నుంచి 40 టీఎంసీల నీరు తోడైతే పూర్తి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుంది లేని పక్షంలో 60 టీఎంసీ నీటినే ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిన 9 లక్షల ఎకరాలకు సరఫరా చేయనున్నారు.

 

చెరువులకు ఊతం... 
కాళేశ్వరం ద్వారా వచ్చే గోదావరి జలాలతో తొలి ప్రాధాన్యంగా చెరువులు నింపనున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు అన్ని చెరువులకు మళ్లేలా పనులు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు బస్వాపూర్‌ వరకు గరిష్టంగా 2,600 చెరువులు నింపే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో మిడ్‌మానేరు దిగువన బస్వాపూర్‌ వరకు 1,700 చెరువులు నింపే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజీ–2 కింద 700 చెరువులు, కడెం కింద 50 చెరువులు, వరద కాల్వ కింద 60 చెరువులు నింపవచ్చని గుర్తించారు. ఇందులో ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే ఎస్సారెస్పీ కింద 200 చెరువులు, అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్‌ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపనున్నారు. ఈ రిజర్వాయర్ల పనుల అనంతరం మల్లన్నసాగర్‌కు చేరే నీటిని ఫీడర్‌ చానల్‌ తవ్వి గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాలువలకు అనుసంధానించి కనిష్టంగా 150 చెరువులు నింపేలా పనులు చేస్తున్నారు. ఈ చెరువులను నింపేందుకు వీలుగా 785 తూముల నిర్మాణం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.  

ఏపీ, మహారాష్ట్ర సీఎంలకు కేసీఆర్‌ ఆహ్వానం.. 
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కేసీఆర్‌ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు వెళ్లి వైఎస్‌ జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. బుధవారం కేసీఆర్‌ ఫడ్నవీస్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రారంభోత్సవానికి రావాలని కోరగా ఆయన అంగీకరించారు. త్వరలోనే స్వయంగా ముంబై వెళ్లి ఫడ్నవీస్‌ను కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు.  

విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు పూర్తి... 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 7,152 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని అంచనా వేశారు. దీనికి తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అత్యధిక విద్యుత్‌ సరఫరా అందించడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల పథకాల కోసమే ప్రత్యేక డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌ను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నియమించారు. జెన్‌ కో– ట్రాన్స్‌ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లకు అవసరమైన విద్యుత్‌కోసం గోలివాడ గ్రామ శివారులో ట్రాన్స్‌మిషన్‌ (సబ్‌స్టేషన్‌) వ్యవస్థ సిద్ధమైంది. నిర్దేశిత గడువుకు ముందే ఈ వ్యవస్థను పూర్తిచేశారు.  

కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యాంశాలు.. 
నీటిని సరఫరా చేసే మార్గం పొడవు: 1832 కి.మీ. 
వాలు కాలువ పొడవు: 1531 కి.మీ. 
వాలు టన్నెల్‌ పొడవు: 203 కి.మీ. 
ప్రెషర్‌ పైపు లైన్‌ పొడవు: 98 కి.మీ. 
లిఫ్టులు: 20 
పంపు హౌస్‌లు: 19 
అవసరమయ్యే విద్యుత్‌: 4,992.47 మెగావాట్లు 
జలాశయాలు: 19 
జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీ 


ప్రాజెక్టులో నీటి లభ్యత (టీఎంసీల్లో) 
గోదావరి నీరు: 180 
ఎల్లంపల్లి ప్రాజెక్టులో లభ్యమయ్యే నీరు: 20 
ఎల్లంపల్లి వద్ద మొత్తం నీటి లభ్యత: 200 
చెరువుల పరివాహక ప్రాంత నీటి లభ్యత: 10 
ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల రీచార్జ్‌: 25 
ఆవిరి నష్టాలు: 10 
ప్రాజెక్టు వినియోగానికి నికరంగా నీటి లభ్యత: 225 

ప్రాజెక్టులో నీటి వినియోగం (టీఎంసీల్లో) 
కొత్త ఆయకట్టుకు సాగునీరు- 134.5 
శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్‌ ఆయకట్టు స్థిరీకరణ- 34.5 
హైదరాబాద్‌కు నీటి సరఫరా- 30 
గ్రామాలకు తాగునీరు- 10
పారిశ్రామిక అవసరాలకు- 16
మొత్తం నీటి వినియోగం- 225 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాత నోట్లు.. కొత్త పాట్లు!

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు! 

నిధుల సమీకరణపై దృష్టి!

పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు 

పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు 

బిగ్‌బాస్‌ ప్రసారం నిలివేయాలి

అయితే డొక్కు.. లేదా తుక్కు!

ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు!

మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!

ఎక్కడికైనా బదిలీ!

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఏటీఎం దొంగలు దొరికారు 

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

‘గురుకులం’ ఖాళీ!

ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

‘ఎస్‌ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!