‘మేడిగడ్డ’కు మావోల ముప్పు!

3 Mar, 2017 03:21 IST|Sakshi
‘మేడిగడ్డ’కు మావోల ముప్పు!

మహారాష్ట్ర పరిధిలోని బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో ప్రాబల్యం
నిర్వాసితులతో కలసి ఐక్య పోరాటానికి కార్యాచరణ
ప్రాజెక్టు రక్షణ చర్యల కోసం గడ్చిరోలి కలెక్టర్‌కు రాష్ట్ర అధికారుల లేఖ  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మావోయిస్టుల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా బ్యారేజీ పనులు జరుగుతున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పరిధిలో ఇటీవల మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతుండటం, నిర్వాసితులతో కలసి పోరాడేందుకు ఐక్య కార్యాచరణ రూపొందిస్తుండటం నీటిపారుదల శాఖలో కలవరం సృష్టించింది.

వణికిస్తున్న గడ్చిరోలి పరిణామాలు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద 101 మీటర్ల ఎత్తులో 19.73 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మిస్తుండటం తెలిసిందే. దీనివల్ల మొత్తం 13,075 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుండగా ఇందులో 10,218 హెక్టార్లు రివర్‌బెడ్‌లోనే ఉండనుంది. తెలంగాణ పరీవాహకంలో 1,629 హెక్టార్లు, మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల పరిధిలో 1,227 హెక్టార్ల ముంపు ప్రాంతం ఉంటోంది. గతేడాది ఆగస్టు 26 నుంచే బ్యారేజీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రేడియల్‌ గేట్లు, గైడ్‌ బండ్స్‌ వంటి నిర్మాణాలను మేడిగడ్డ, మహారాష్ట్రలోని సిరోంఛ తాలూకా పోచంపల్లి గ్రామం మధ్య చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే బ్యారేజీకి ఎడమ పక్కగా పనులు చేస్తున్న ఎల్‌ అండ్‌ టీ సిబ్బంది 1.69 హెక్టార్లలో క్యాంపులు వేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

అయితే తాజాగా ఈ ప్రాంత పరిధిలోని గడ్చిరోలి జిల్లా సిరోంఛ, ఆసరెల్లిలో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగాయి. బ్యారేజీ కింది నిర్వాసిత గ్రామాలైన వడిజెం, పోచంపల్లి, మద్దికుంట, చింతపల్లిలో మావోయిస్టులు...బ్యారేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాం దోళనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ద తిస్తున్నారు. ఇటీవల గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓ ప్రభుత్వ కలప డిపోతోపాటు కొన్నిచోట్ల రోడ్ల పనులు చేస్తున్న భారీ వాహనాలను తగులబెట్టారు. నిర్వాసిత గ్రామాల్లోనూ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ పోస్టర్లు అంటించారు. దీనికి తోడు గోదావరి పరీవాహకం వెంబడి రాష్ట్రాల్లో మావోయిస్టులు ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర హోంశాఖ చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

భద్రత కోసం గడ్చిరోలి కలెక్టర్‌కు వినతులు..
బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో నిర్వాసితుల ఆందోళనల దృష్ట్యా మావోయిస్టులు ఏ రూపంలో అయినా విరుచుకుపడే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌... గడ్చిరోలి కలెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు. బ్యారేజీ పనులకు మావోయిస్టులు అంతరాయం కలిగించే ప్రమాదం ఉన్నందువల్ల భద్రత కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై కలెక్టర్‌ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరోవైపు గడ్చిరోలి ప్రభావం ఈ ప్రాజెక్టు పరిధిలోని రాష్ట్ర భూభాగంలోనూ ఉంటుందన్న ఆందోళన నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ప్రభుత్వం సీఆర్పీఎఫ్‌ బలగాలతో క్యాంపుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వారంలో ఇక్కడ క్యాంపుల ఏర్పాటు జరిగే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలంగాణకు మంజూరైన ఒక ఇండియన్‌ రిజర్వ్‌ (ఐఆర్‌) బెటాలియన్‌తోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సైతం ఆదేశించింది.

మరిన్ని వార్తలు