ఆహా.. మిడ్‌ మా‘నీరు’!

30 Dec, 2019 01:48 IST|Sakshi

నిండుకుండను తలపిస్తున్న రిజర్వాయర్‌

మొత్తంగా వచ్చిన 52 టీఎంసీల్లో కాళేశ్వరంతో ఎత్తిపోసిన నీరే అధికం

25.11 టీఎంసీలకు చేరిన నిల్వ

నేడు సీఎం పర్యటన అనంతరం కాల్వలకు నీటి విడుదల అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటి తరలింపుతో శ్రీ రాజ రాజేశ్వర రిజర్వాయర్‌ (మిడ్‌మానేరు) నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 25.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.11 టీఎంసీల మేర నిల్వ ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిజర్వాయర్‌లోకి 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీటి పరిమాణమే 46.46 టీఎంసీలుగా ఉంది. మరో 3.07 టీఎంసీ వరద నీరు కాగా, 2.45 టీఎంసీల నీరు ఎస్సారెస్పీ ద్వారా వచ్చింది. ఇప్పటికే మిడ్‌మానేరు ద్వారా లోయర్‌ మానేరు డ్యామ్‌కు 29.14 టీఎంసీల మేర నీటిని తరలించారు. 

ఎల్‌ఎండీ నుంచి ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీటిని తరలించి చెరువులు నింపారు. అయితే కాళేశ్వరంలో భాగంగా మిడ్‌మానేరు నుంచి నీటిని ప్యాకేజీ–10, 11, 12ల ద్వారా దిగువ అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌ ద్వారా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉంది. అయితే అనంతగిరి గ్రామం ఖాళీ చేయకపోవడంతో నీటి పంపింగ్‌ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. 

సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వాయర్‌ పరిధిలో చేసే పర్యటన సందర్భంగా కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిడ్‌మానేరు కుడి, ఎడమ కాల్వల కింద 75 కిలోమీటర్ల కాల్వల తవ్వకం చేయాల్సి ఉండగా, 60కిలోమీటర్లు పూర్తయింది. దీనికింద 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ యాసంగిలో 25వేల నుంచి 30వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు