కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్‌ మొదలైంది

22 Nov, 2019 04:03 IST|Sakshi

లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ల్లో నాలుగేసి మోటార్ల ద్వారా..

ఎల్లంపల్లికి నీటి ఎత్తిపోతలు.. అటు నుంచి మిడ్‌మానేరుకు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల తొలిదశలో పూర్తిస్థాయి ఎత్తిపోతల ఆరంభమైంది. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు ఉన్న అన్ని పంప్‌హౌస్‌లలో మోటార్లు తిరగడం మొదలైంది. రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం.. మిడ్‌మానేరు నింపుతుండటంతో ఎల్లంపల్లి ఖాళీ అవుతుండటంతో కాళేశ్వరం ద్వారా లభ్యతగా ఉన్న గోదావరి వరద నీటినంతా ఒడిసిపట్టేలా లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) మోటార్లను నడిపిస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి దాని దిగువన సిద్దిపేట జిల్లాలో ఉన్న రెండు రిజర్వాయర్లకు నీటిని డిసెంబర్‌ నుంచి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

గేట్లు క్లోజ్‌.. మోటార్లు ఆన్‌.. 
కాళేశ్వరంలో మొదటిదైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి వరద మొన్నటి వరకు లక్ష క్యూసెక్కుల వరకు నమోదైంది. వర్షాకాల సీజన్‌లో మేడిగడ్డను దాటుకుంటూ కనిష్టంగా వెయ్యి టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయింది. అయితే విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, మిడ్‌మానేరు కట్టలో లోపాల కారణంగా ఎత్తిపోతల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం మిడ్‌మానేరు సిద్ధంకావడంతో ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా నీటి ఎత్తిపోతల ఆరంభమైంది. ఇక్కడి 5 మోటార్ల ద్వారా రోజుకు 1.5 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. దీంతో ఎల్లంపల్లిలో నిల్వ 20 టీఎంసీలకుగానూ 7.5 టీఎంసీలకు చేరగా, మిడ్‌మానేరులో నిల్వ 25.87 టీఎంసీలకు గానూ 16 టీఎంసీలకు చేరింది.

ఎల్లంపల్లి ఖాళీ అవుతుండటంతో ఎగువన ఉన్న మూడు పంప్‌హౌస్‌ల మోటార్లను ఆన్‌ చేశారు. దీనికోసం మేడిగడ్డ బ్యారేజీలో నిల్వలు పెంచేందుకు గేట్లన్నింటినీ మూసివేశారు. ప్రస్తుతం గోదావరిలో 20వేల క్యూసెక్కుల వరద ఉండగా, దానిని అడ్డుకుంటున్నారు. దీంతో నిల్వలు పెరగనున్నాయి. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 4 మోటార్లు ఆన్‌ చేసి 8,400 క్యూసెక్కుల నీటిని అన్నారం పంపుతున్నారు. అక్కడి నాలుగు మోటార్ల ద్వారా సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ప్రస్తుతం పంపింగ్‌ మొదలైంది. ఈ ప్రక్రియ గోదావరి వరద ఉన్నన్ని రోజులు నిరంతరాయంగా కొనసాగనుంది.  

మిడ్‌మానేరు కిందికి తీసుకెళ్లే యత్నాలు 
మిడ్‌మానేరులోకి ఎత్తిపోతలు సాగుతుండటంతో అక్కడి నుంచి లోయర్‌ మానేరుకు నీటిని తరలించనున్నారు. లోయర్‌ మానేరులో నీటిని పూర్తి స్థాయిలో నింపిన అనంతరం మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ–10, 11, 12ల పరిధిలోని అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌ల రిజర్వాయర్‌లను నింపనున్నారు. ఈ ప్యాకేజీల పరిధిలో ఉన్న నాలుగేసి మోటార్లకు డిసెంబర్‌లో వెట్‌రన్‌ పూర్తి చేసిన అనంతరం కొత్త ఏడాదిలో కొండపోచమ్మ వరకు నీటిని తరలించే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా