భారీ ప్రాజెక్టుల్లో ‘పని’ విభజన

22 Jul, 2020 05:49 IST|Sakshi

ఐదుగురు సీఈల పరిధిలోకి కాళేశ్వరం ప్రాజెక్టు 

ముగ్గురు సీఈలకు ఎస్సారెస్పీ ఆయకట్టు బాధ్యతలు 

పాలమూరు–రంగారెడ్డి, సాగర్‌ ఆయకట్టుకు ఇద్దరు సీఈలు 

ఈఎన్సీ అడ్మిన్, ఇతర ఈఎన్సీల కొనసాగింపు, ఓఅండ్‌ఎంకు అదనపు ఈఎన్‌సీ జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై సీఎం 

మార్గదర్శనం, నేడో రేపో ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర జల వనరుల శాఖ సమూల ప్రక్షాళనలో భాగంగా భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయి. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల సమర్థ నిర్వహణకు వీలుగా.. ఒక్కరి కిందే ఉన్న ప్రాజెక్టు పనులను అవసరాలకు తగ్గట్టు విభజించనున్నారు. ప్రాజెక్టుల కింది ఆయకట్టు, రిజర్వాయర్, పంప్‌హౌస్‌లు, కాల్వలు, ఐడీసీ పథకాలు, చెరువులను లెక్కలోకి తీసుకుంటూ పని విభజన చేస్తూ పునర్విభజన చేశారు. ప్రధానమైన కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను ఏకంగా ఐదుగురు చీఫ్‌ ఇంజనీర్లు (సీఈ)లకు కట్టబెట్టనుండగా, పాలమూరు–రంగారెడ్డి బాధ్యతల నిర్వహణకు ఇద్దరు సీఈలను నియమించనున్నారు.

నాగార్జునసాగర్‌ ఆయకట్టు ఇద్దరు సీఈలు, ఎస్సారెస్పీ కింది కాల్వల బాధ్యతలు ముగ్గురు సీఈల పరిధిలోకి వెళ్లనుంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐడీసీ)ని పూర్తిగా రద్దుచేసి, ఆయా జిల్లాల పరిధిలోని సీఈలకే బాధ్యతలు కట్టబెట్టనున్నారు. ఇప్పటివరకు ఉన్న గోదావరి, కృష్ణా బేసిన్లలోని చెరువుల బాధ్యతలను చూస్తున్న ప్రత్యేక సీఈలను తొలగించనున్నారు. కొత్తగా నియమించే సీఈలకు ఈ చెరువుల బాధ్యతలు అప్పగిస్తారు.  

కీలక నిర్ణయాల్లో కొన్ని.. 
► ప్రస్తుతం పరిపాలన వ్యవహారాలు చూస్తున్న ఈఎన్‌సీ అడ్మిన్‌ యథావిధిగా కొనసాగుతారు. ఆయన పరిధిలో ఉండే కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ) మాత్రం ఇరిగేషన్‌ ఈఎన్‌సీ పరిధిలోకి వెళ్తుంది. గోదావరి, కృష్ణా బేసిన్‌లోని పంప్‌హౌస్‌ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం)కు ప్రత్యేక ఈఎన్‌సీ నియామకానికి సీఎం అవకాశం కల్పించారు. 
► ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాణహితతో పాటు చనాకా–కొరాటా, చెన్నూరు ఎత్తిపోతల, సాత్నాల, గడ్డెన్నవాగు, వట్టివాగు ఎత్తిపోతల పథకాలన్నీ ప్రస్తుతం ఒక్క సీఈ పరిధిలోనే ఉండగా, దానిని ఇప్పుడు రెండుగా విభజించి మంచిర్యాల కేంద్రంగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. ఈ జిల్లాలో అన్ని రకాల సాగునీటి వనరుల కింద ఉన్న 8.12లక్షల ఎకరాల ఆయకట్టును వీరిద్దరికి అప్పగిస్తారు. 
► ఎస్సారెస్పీ–1 కింద ఒక సీఈని నియమించనుండగా, ఆయన కింద డ్యామ్, లోయర్‌ మానేరు వరకు కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ, కాళేశ్వరంలోని ప్యాకేజీ– 27, 28, కుఫ్తి, కడెం, సదర్‌మట్‌ బ్యారేజీలు ఉండనున్నాయి. ఆయకట్టు 6.62 లక్షలు ఉండనుంది. 
► కరీంనగర్‌ జిల్లా సీఈ పరిధిలో లోయర్‌మానేరు కింద కాకతీయ కాల్వ 245వ కిలోమీటర్‌ వరకు, మిడ్‌మానేరు, గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి, అప్పర్‌మానేరు, బొగ్గులవాగు ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 8.25 లక్షల ఎకరాలు. 
► ఎస్పారెస్పీ–2 వరంగల్‌ సీఈ పరిధిలో కాకతీయ కాల్వ 245 కిలోమీటర్‌ నుంచి 346వ కిలోమీటర్‌ వరకు, ఇతర ఎత్తిపోతల పథకాలు ఉండనున్నాయి. వీటి కింది ఆయకట్టు 6.66 లక్షల ఎకరాలు. 
► కొత్తగా ఉమ్మడి నిజామాబాద్‌ ప్రాజెక్టుల కింద సీఈని నియమించనుండగా, ఆయన కింద నిజాంసాగర్, లెండి, గుత్ప, అలీసాగర్, కాళేశ్వరం ప్యాకేజీ–20, 21, 22 పనులు ఉండనున్నాయి. మొత్తం ఆయకట్టు 8.20 లక్షలు. 
► కాళేశ్వరం ప్రాజెక్టు–1 సీఈ పరిధిలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, మిడ్‌మానేరు ఎగువన మూడు ప్యాకేజీలు, ప్యాకేజీ–9, ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం, మంథని, గూడెం లిఫ్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం, వరద కాల్వ ఉండనున్నాయి. ఆయకట్టు 3.41 లక్షల ఎకరాలు. 
► హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే కాళేశ్వరం  ప్రాజెక్టు సీఈ–2 పరిధిలో అనంతగిరి రిజర్వాయర్‌ నుంచి బస్వాపూర్‌ వరకు ఉన్న ప్యాకేజీలు ఉంటాయి. ఆయకట్టు 7.85 లక్షల ఎకరాలు. 
► ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ఒక సీఈని నియమించి ఆయన కింద సింగూరు, ఘణపూర్, నల్లవాగుతో పాటే కాళేశ్వరంలోని ప్యాకేజీ 17, 18, 19ని ఉంచనున్నారు. 
► వరంగల్‌ సీఈ పరిధిలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల, దేవాదుల కింది వ్యవస్థ ఉండనుంది. ఆయకట్టు 10.32 లక్షల ఎకరాలు. 
► నల్లగొండ–1 సీఈ పరిధిలో పాలేరు వరకు నాగార్జునసాగర్‌ ఆయకట్టు, ఎస్‌ఎల్‌బీసీ, ఉదయసముద్రం, మూసీ, ఆసిఫ్‌నహర్‌ వంటివి ఉంటాయి. ఆయకట్టు 9.86 లక్షల ఎకరాలు.  
► నల్లగొండ–2 సీఈ పరిధిలో డిండి ఎత్తిపోతలు, డిండి ఉండనుండగా, 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. 
► ఖమ్మం జిల్లా సీఈ పరిధిలో సీతారామ, పాలేరు కింద నాగార్జునసాగర్‌ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులుంటాయి. ఆయకట్టు 9.61లక్షల ఎకరాలు. 
► మహబూబ్‌నగర్‌ కేంద్రంగా ఉండే పాలమూరు–రంగారెడ్డి–1 సీఈ పరిధిలో ఉధ్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల కింది కాల్వలు, ఆయకట్టు 9.15 లక్షల ఎకరాలతో పాటు ఇతర ఐడీసీ ఎత్తిపోతల పథకాలు ఉండనున్నాయి. 
► నాగర్‌కర్నూల్‌ కేంద్రంగా ఉండే పాలమూరు–రంగారెడ్డి–2 సీఈ పరిధిలో కల్వకుర్తి, కర్వెన్‌ వరకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర ఐడీసీ పథకాలు ఉంటాయి. ఆయకట్టు 9.83 లక్షల ఎకరాలు. 
► వనపర్తి కేంద్రంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సీఈ పరిధిలో జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, ఆర్డీఎస్‌ ఉండనున్నాయి. ఆయకట్టు 8.16 లక్షల ఎకరాలు.  
వెంటనే ప్రాజెక్టుల నిధుల సమీకరణ 
నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతోపాటు పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటికి నిధుల సమీకరణ అంశంపై సీఎం మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్‌సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘నీటి లభ్యతగల సమయంలో ప్రతిరోజూ గోదావరి నది నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 3 టీఎంసీల నీటిని తరలించి రాష్ట్రంలోని కోటీ 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం బడ్జెట్‌ నిధులతోపాటు వివిధ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆర్థిక సహాయానికి సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటాను చెల్లించి వెంటనే నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. వర్షాకాలం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలి’అని చెప్పారు.  

మరిన్ని వార్తలు