తెలంగాణ బతుకుదెరువు కాళేశ్వరం

7 Jul, 2018 01:56 IST|Sakshi

మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాలకోసం. పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ పచ్చటి పంటలతో తులతూగాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ బతుకుదెరువు కాళేశ్వరం. ఇది పూర్తి చేయాలనే తపనతో రేయింబవళ్లు కష్టపడుతున్నాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాఘవాపూర్, గజ్వేల్‌ ప్రాంతాల్లో ఆయన పర్య టిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడారు.

తెలంగాణ ప్రాంతంలో వర్షాలు సక్రమంగా పడకపోవడంతో రైతులు కరువు కాటకాలతో అల్లాడే వారని, బతుకు దెరువు కోసం దుబాయ్, ముంబై, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు వెళ్లిన వారు తిరిగి రావాలంటే ఇక్కడ ప్రతి సెంటు భూమికి నీరు అందాలని, బోర్లు వేసే పని లేకుండానే సాగునీరు రావాలని అన్నారు. ఇందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు. బోర్లు వేసి, బావులు తవ్వి అప్పుల పాలైన రైతుల కష్టాలు స్వయంగా చూసిన సీఎం.. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించేందుకు కష్టపడుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగా కరువు సీమగా పేరుగాంచిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, కాళేశ్వరం నిర్మాణం, ఎస్సారెస్పీ పునరుద్ధరణ.. ఇలా అవసరమైన ప్రతీ చోట కృష్ణా, గోదావరి నది నీళ్లను వినియోగించుకుంటామని వెల్లడించారు.  

విపక్షాలకు కంటి మీద కునుకులేదు..  
గతంలో ఏనాడూ రైతుల గురించి, సాగునీటి గురించి ఆలోచించని కొందరు నాయకులు నేడు ప్రాజెక్టుల నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల కాలంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు దశాబ్ద కాలం పట్టేదని, ఇప్పుడు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడం చూసిన ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండాపోతోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్స్‌ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో మెరుగైన విద్య, వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులకు పోషక విలువతో కూడిన ఆహారం అందిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు