త్వరలో జిల్లాలో పరవళ్లు

14 Apr, 2020 10:44 IST|Sakshi
నాలుగో పంపు ద్వారా అనంతగిరి సాగర్‌లోకి చేరుతున్న నీళ్లు

కాళేశ్వరం నుంచి అనంతగిరికి చేరిన ఒక టీఎంసీ నీరు

రంగనాయకసాగర్‌కు పంపింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం  

శుభ ముహూర్తానికి అడ్డువచ్చిన ‘కరోనా’

ఈ వేసవిలోనే చెరువుల్లోకి జలాలు..  

ఈ వేసవి ముగిసేలోపు గోదావరి జలాల గలగల సవ్వడి జిల్లాలో వినిపించనుంది.  సిద్దిపేటను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సిద్దిపేటకు వచ్చే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోదావరి జలాలు జిల్లా సరిహద్దుకు చేరాయి. ఇక రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్, ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లు, అక్కడి నుంచి జిల్లాలోని చెరువుల్లోకి గోదావరి జలాలు పరుగులు పెట్టే గడియ రానే వచ్చింది. కరోనా ప్రభావంతో కాస్త ఆలస్యమైనా మిషన్‌ కాకతీయ ద్వారా అందంగా ముస్తాబైన చెరువుల్లో తర్వరలో జలకల సంతరించుకోనుంది.

సాక్షి, సిద్దిపేట  :జిల్లా అంతా మెట్ట ప్రాంతం. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు ఎత్తిపోసే పని దాదాపుగా పూర్తి కావచ్చింది. కాళేశ్వరం నుండి దశలవారిగా మిడ్‌మానేరుకు చేరాయి. అక్కడి నుండి సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి సాగర్‌ రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేశారు. మొత్తం 3.5టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌ నింపేందుకు నాలుగు పంపులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రిజర్వాయర్‌ కావునా కొద్దికొద్దిగా పంపులు వదులుతూ.. నీటిని నింపుతున్నారు. దీంతో ఇప్పటికి 0.8 టీఎంసీ నీళ్లు చేరాయి. దీంతో అనంతగిరి సాగర్‌ నుండి రంగనాయకసాగర్‌కు పంపింగ్‌ చేసే ప్రదేశం వద్దకు గోదారమ్మ వచ్చి ఆగింది..

శుభ ముహూర్తానికి అడ్డువచ్చిన కరోనా
జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి సాగర్‌ వరకు వచ్చిన గోదావరి జలాలు జిల్లాకు ఎత్తిపోసేందుకు సర్వం సిద్దమైంది. అయితే కరోనా మహర్మారితో నీళ్లపండుగ ఆగిపోయింది.  3 టీఎంసీల సామర్థ్యంతో 1.10లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేలా రంగనాయకసాగర్, 15టీఎంసీల సామర్థ్యంలో 2.85లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కొండపొచమ్మ సాగర్, అదేవిధంగా 50టీఎంసీల సామర్థ్యంలో 1.25లక్షల ఎకరాలకు నీరు అందించే మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులు నిర్మించారు.  అయితే ఇందులో మల్లన్న సాగర్‌ మినహా మిగిలిన మూడు రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. అనంతగిరి వరకు నీళ్లు వచ్చాయి. ఈ నీటిని ముందుగా రంగనాయకసాగర్‌కు పంప్‌ చేస్తారు. అక్కడి నుండి  టన్నెల్, గ్రావిటీ కెనాల్‌ ద్వారా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ వద్దకు నీటికి తీసుకెళ్తారు. అయితే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి కాకపోయినా..  తుక్కాపూర్‌ వరకు వచ్చిన  నీటిని 18 కిలో మీటర్ల పొడవునా కాలువ తవ్వి కొండపొచమ్మ సాగర్‌ కాల్వకు అనుసంధానం చేశారు... ఇలా మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో పనిలేకుండా గోదావరి జలాలు కిందికి తరలించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.  

కరోనా ప్రభావంతో ఆలస్యం
సిద్దిపేట జిల్లా సరిహద్దు అనంతగిరి రిజర్వాయర్‌ వరకు గోదావరి జలాలు వచ్చాయి.. అక్కడి నుండి రంగనాయకసాగర్‌లోకి పంపింగ్‌ చేసేందుకు సర్వం సిద్దం చేశాం. మంచి ముహూర్తం పెట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించుకొని పండుగ వాతావరణం మధ్య గోదారమ్మకు స్వాగతం పలుకుదాం అనుకున్నాం.. ఇంతలోనే కరోనా వైరస్‌ వచ్చి అంతా తారుమారు చేసింది. ఏది ఏమైనా.. ఈ వేసవిలో జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.. వారి ఆదేశాల మేరకు వేసవిలో చెరువులు నింపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాం.  – హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి  

ఆ గడియ కోసమేఎదురు చూపు..  
కరువు ప్రాంతం సిద్దిపేటను కోనసీమను తలపించేలా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనకు ప్రతీరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టువదలకుండా రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేశారు. గోదావరి జలాలు జిల్లాలో పారే గడియ కోసమే జిల్లా ప్రజలు వేయికళ్లతో వెదురు చూస్తున్నారు..– రాధాకృష్ణ శర్మ,టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి

మరిన్ని వార్తలు