కాళేశ్వరం ట్రయల్‌ రన్‌

17 Apr, 2019 04:19 IST|Sakshi

నేడు తొలిసారిగా గోదావరి నీటితో ట్రయల్‌ రన్‌ 

ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్‌హౌస్‌కు నీటి తరలింపు 

సీఎం ఆదేశాల నేపథ్యంలో అంతా సిద్దం చేసిన ఇంజనీర్లు 

లీకేజీలు గుర్తించాక నాలుగైదు రోజుల్లో మళ్లీ మోటార్ల వెట్‌ రన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానం బుధవారం మొదలుకానుంది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్‌ నుంచే గోదావరి జలాలను పంట పొలాలకు తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. పూర్తయిన నిర్మాణ పనులన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పంప్‌హౌస్‌లలో మోటార్ల డ్రైరన్‌ నిర్వహించిన ఇంజనీర్లు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో తొలిసారిగా గోదావరి నీటితో వెట్‌ రన్‌ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. తొలి పరిశీలనలో భాగంగా బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారంలోని ప్యాకేజీ–6కి నీటిని విడుదల చేయడానికి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈ పనులతో కాళేశ్వరం ప్రస్థానానికి పునాది పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

0.25 టీఎంసీతో వెట్‌రన్‌.. 
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న 8.46 టీఎంసీల నీటిలో 0.25 టీఎంసీల నీటిని వినియోగించి బుధవారం ట్రయల్‌ రన్‌ చేయడానికి ఇంజనీర్లు అంతా సిద్ధంచేశారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా, వీటిలో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్‌కు నీటి ని తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యాసం కలిగిన జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6లోని సర్జ్‌పూల్‌కు నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ల ద్వారా ప్యాకేజీ–7కు నీటిని తరలించాలి. అయితే ఈ ప్యాకేజీలో టన్నెల్, గ్రావిటీ కాలువ పనులు పూర్తవగా.. ఐదు మోటార్లు సిద్ధమయ్యాయి. 

మరో రెండు మోటార్ల పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెట్‌ రన్‌లో భాగంగా 0.25 టీఎంసీ నీటిని గ్రావిటీ కాలువ, టన్నెల్‌ ద్వారా వదిలి సర్జ్‌పూల్‌ను నింపుతారు. అయితే, సర్జ్‌పూల్‌ను ఒకేసారి కాకుండా విడతలవారీగా నింపుతారు. ముందుగా 10శాతం వరకు, తర్వాత 25 శాతం వరకు, ఆ తర్వాత 50శాతం వరకు.. ఇలా వంద శాతం వరకు నింపుతూ వెళతారు. ప్రతిసారీ సర్జ్‌పూల్‌లో కానీ, టన్నెళ్లలో కానీ ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయోమోనని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ ఒక్కో మోటార్‌ను ఆన్‌ చేసి పరిశీలిస్తారు. ఈ పంపుల్లో మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇబ్బందులేవైనా ఉంటే గుర్తించేందుకు ఈ ట్రయల్‌ రన్‌ దోహదపడనుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియకు మొత్తం రెండు నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అనంతరం ప్యాకేజీ–7లోని టన్నెళ్ల నిర్మాణం పూర్తయ్యాక ప్యాకేజీ–8లోని పంపులను కూడా ఇదే విధంగా పరిశీలిస్తారు.  

2020 జూన్‌కు మల్లన్నసాగర్‌..
ఇక ప్రాజెక్టులో అత్యంత కీలకంగా మారిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని 2020 జూన్‌ నాటికే సిధ్దం చేయాలని సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం అన్ని పనులు సమాంతరంగా జరగాలని స్పష్టంచేశారు. నిజానికి మల్లన్నసాగర్‌ రిజ్వాయర్‌ కిందే మెదక్‌ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు మల్లన్న సాగర్‌ నుంచే నీటిని తరలించాలని ప్రణాళిక వేశారు. సింగూరు ప్రాజెక్టుకు, నిజాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్నసాగర్‌ నుంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. 

మొత్తం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఈ రిజర్వాయరే గుండెకాయగా ఉండనుంది. ఈ రిజర్వాయర్‌ కింద మొత్తం 13,970 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. మూడున్నరేళ్లుగా భూసేకరణ పనులు జరుగుతున్నా, నిర్వాసితుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ గ్రామాల పరిధిలోని నిర్వాసితులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో వెయ్యి ఎకరాలకు గానూ 910 ఎకరాలను ఎకరం రూ.7.75 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కేవలం మరో 90 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. అయితే సహాయ పునరావాస పనుల్లో నిర్వాసితుల నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. చట్ట ప్రకారం ఇక్కడ అర్హులకు 250 గజాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఎకరానికి రూ.7.50లక్షలు, ఒకవేళ డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వద్దనుకుంటే రూ.5.04 లక్షలను నేరుగా నిర్వాసితులకు చెల్లిస్తున్నారు. దీంతోపాటే ఇంటి నిర్మాణాన్ని బట్టి దానికి ధర చెల్లిస్తున్నారు. అయితే నిర్వాసితులు ప్రభుత్వం భూమికి నిర్ణయించిన పరిహారాన్ని పెంచాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. 

పూర్తిస్థాయిలో పరిహారం అందేవరకు భూమి ఇవ్వలేమని చెబుతున్నారు.  ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లిలో వసతుల కల్పన లేదని చెబుతున్నారు.  బలవంతపు సేకరణను నిరసిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్, తొగుట, వేములఘాట్‌ ప్రజలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పనులు ముందుకు కదలడంలేదు. రిజర్వాయర్‌ పనులను రూ.6,805కోట్లతో 4 రీచ్‌లుగా చేపట్టగా.. కేవలం ఒక రీచ్‌లో మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. మొత్తం 13 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని జరగాల్సి ఉండగా, కేవలం 2 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనే జరిగింది. ఈ నేపథ్యంలో కేసుల పరిష్కారానికి తగిన చొరవ చూపాలని, చట్టపరంగా తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని సీఎం కేసీఆర్‌.. కలెక్టర్లు, ప్రభుత్వలాయర్లు, ఇంజనీర్లకు సూచించారు.  

మరిన్ని వార్తలు