కాళేశ్వరం పనులు కొనసాగించవచ్చు!

9 Nov, 2017 01:49 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరణ 

ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలంటూ గత నెల 5న ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ప్రధాన బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. పనులు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకు కాలువలు, పిల్ల కాలువల నిర్మాణ పనులతోపాటు ఇతర అనుబంధ పనులను మాత్రం చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటవీ అనుమతులు వచ్చేంత వరకు అటవీ భూములను తాకరాదని సూచించింది. ఈ ప్రాజెక్టు కారణంగా అటవీ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కూలరాదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఇప్పటికే ఏవైనా పనులు చేపట్టి ఉంటే కేవలం తాగునీటి అవసరాలకే వాటిని పరిమితం చేయాలని స్పష్టం చేసింది.

ఈ ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తమ దృష్టికి గానీ, ఎన్‌జీటీ దృష్టికి గానీ తీసుకురావొచ్చని ఫిర్యాదుదారు ఎం.హయత్‌యుద్దీన్‌కు తెలిపింది. ఒకవేళ ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే పిటిషన్‌ను విచారించే న్యాయపరిధి ఉందో లేదో తేల్చడానికి ముందే.. రాష్ట్ర ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవచ్చని ఎన్‌జీటీకి హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైన పక్షంలో తాగునీటి ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలని కూడా ఆదేశాలు ఇవ్వొచ్చని చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. చట్టపరమైన అనుమతులు లేకుండానే ప్రభుత్వం కాళేశ్వరం పనులను కొనసాగిస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన హయత్‌యుద్దీన్‌ ఢిల్లీలోని ఎన్‌జీటీ ప్రధాన బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఎన్‌జీటీ, కాళేశ్వరం పనులన్నింటినీ తక్షణమే నిలిపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత నెల 5న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఎన్‌జీటీ ఉత్తర్వుల వల్ల రోజుకు రూ.కోటి నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వాదించింది. ఈ మేరకు తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం, బుధవారం తీర్పు వెలువరించింది. 

న్యాయపరిధిపై వాదనలు వినాల్సింది 
దక్షిణాది రాష్ట్రాల కోసం చెన్నైలో ఉన్న ఎన్‌జీటీ బెంచ్‌లో కాకుండా ఢిల్లీలోని ప్రధాన బెంచ్‌ ముందు హయత్‌యుద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే న్యాయపరిధి ప్రధాన బెంచ్‌కు ఉందా, లేదా అన్న అంశంపైనా ధర్మాసనం కూలంకషంగా చర్చింది. న్యాయపరిధిపై ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తినప్పుడు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే ఆ అంశంపై ఎన్‌జీటీ ప్రధాన బెంచ్‌ వాదనలు విని ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేయకుండా నేరుగా పిటిషన్‌ను విచారించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని, అందువల్ల కూడా తాము ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని తెలిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం తాజాగా తిరిగి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్‌జీటీకి స్పష్టం చేసింది.  

మా అధికారాలను ఉపయోగించవచ్చు
ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే అర్హత హైకోర్టుకు లేదన్న ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్‌ను విచారించకుండా తిరస్కరించేందుకు కారణమేదీ కనిపించడం లేదని తెలిపింది. ఎన్‌జీటీ ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించడానికి వీల్లేదన్న వాదనను తిరస్కరించింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు, పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు హైకోర్టు అధికరణ 226 కింద తమకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది.

ఆ వ్యాజ్యాలనే విచారించాలి 
ఏ పనులపై అభ్యంతరం చెబుతూ పిటిషన్‌ దాఖలు చేశారో.. ఆ పనులు ప్రారంభమైన నాటి నుంచి ఆరు నెలల్లోపు సదరు పిటిషన్‌ను దాఖలు చేయాలని ఎన్‌జీటీ చట్టంలోని సెక్షన్‌ 14(3) స్పష్టం చేస్తోందని ధర్మాసనం గుర్తు చేసింది. నిర్ణీత గడువు లోపు దాఖలు చేసిన పిటిషన్లనే ఎన్‌జీటీ విచారించాలని, అలాంటి పిటిషన్లను మాత్రమే విచారించే న్యాయపరిధి ఎన్‌జీటీకి ఉందని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ముందు సెక్షన్‌ 14(3) నిర్దేశించిన గడువు గురించి ఎన్‌జీటీ తప్పక పరిశీలించాల్సిందని, అయితే ఈ కేసులో ఎన్‌జీటీ ఆ పని చేయలేదని ధర్మాసనం ఆక్షేపించింది. గత నెల 5న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాము రద్దు చేయడానికి ఇది ఓ ప్రధాన కారణమని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. 

మరిన్ని వార్తలు