జాతీయ ప్రాజెక్టుగా ‘కాళేశ్వరం’!

29 Jan, 2016 03:46 IST|Sakshi
జాతీయ ప్రాజెక్టుగా ‘కాళేశ్వరం’!

ప్రస్తుత ప్రాజెక్టు పూర్వాపరాలతో నివేదిక తయారీకి సీఎం ఆదేశం
ఆగమేఘాలపై సీఎస్‌కు నీటిపారుదలశాఖ నివేదిక


సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేస్తూ కొత్తగా చేపట్టిన ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకానికి కేంద్ర జాతీయ హోదా దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 ఫిబ్రవరి రెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తుండటం, ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరడంతో ప్రస్తుత డీపీఆర్‌తోపాటు ప్రాజెక్టు పూర్వాపరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీంతో ఆగమేఘాలపై కదిలిన ఉన్నతాధికారులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఈ నివేదికను అందజేశారు.

 ఇక మిగిలింది చర్చలే
ఇప్పటికే సిద్ధమైన కాళేశ్వరం డీపీఆర్ ప్రకారం మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి అక్కడ్నుంచి గోదావరి నదీ మార్గం ద్వారా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించాలని నిర్ణయించారు. ఈ మార్గంలో 19 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు నిర్మించాలని ప్రణాళిక వేశారు. మొత్తంగా బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాల కోసం రూ. 10,200 కోట్లతో అంచనాలు సిద్ధమవగా ఎల్లంపల్లి దిగువన సైతం పలు రిజర్వాయర్ల సామర్ధ్యం పెంపు, పలుచోట్ల తగ్గింపునకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

కేవలం మేడిగడ్డ ముంపునకు సంబంధించి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర చర్చలు, ఒప్పందాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇవి కొలిక్కి వస్తే కాళేశ్వరానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగినట్లే. అదీగాక ముఖ్యమైన పర్యావరణ, అటవీ, గిరిజన సలహా మండలి ఆమోదం కాళేశ్వరానికి అవసరం లేదు.

గోదావరి నదీ ప్రవాహాన్ని వాడుకుంటూనే మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య నీటి తరలింపు ఉండటం, ఎల్లంపల్లి దిగువన ఇప్పటికే అవసరమైన అనుమతులు ఉండటంతో కొత్త అనుమతులు అవసరం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని ప్రధానికి మరోసారి నివేదించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు