గోదావరిపై ఏకైక శైవక్షేత్రం కాళేశ్వరం

12 Jul, 2015 13:47 IST|Sakshi
గోదావరిపై ఏకైక శైవక్షేత్రం కాళేశ్వరం

మహదేవపూర్ : తెలంగాణ రాష్ట్రంలో గోదావరినదిపై వెలసిన ఏకైక శైవక్షేత్రం కాళేశ్వరం. ఈనెల 14 నుంచి 25వ తేదీ వరకు జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ ప్రాంతానికే కొత్త కళ సంతరించుకుంది. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఆలయానికి సుమారు వివిధ పనుల రూపంలో రూ.20 కోట్లు కేటాయించారు. వీటితో ప్రధాన, అనుబంధ ఆలయూలను అభివృద్ధి చేయడంతోపాటు అంతర్గత రోడ్లు, తాగునీటి వసతి, పుష్కరఘాట్ల నిర్మాణం, ఇతర పనులు చేపట్టారు.

 
ఆలయానికి రూ.1.10కోట్లు
 కాశేశ్వరం క్షేత్రంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.కోటీ పది లక్షల నిధులతో వివిధ అభివృధి పనులు పూర్తి చేశారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలకు రంగులు, క్యూలైన్ల నిర్మాణం, రాజరాజేశ్వరం, టీటీడీ సత్రాల మరమ్మతులు, ప్రసాదాల తయారీ షెడ్డు, విక్రయ కౌంటర్లు, విద్యుత్ దీపాల అలంకరణ, భక్తుల సౌకర్యం కోసం రేకుల షెడ్ల నిర్మాణం, ఆలయాల్లో తాత్కాలిక వసతులు తదితర పనులు పూర్తి చేశారు.
 
ఘాట్లకు రూ.రెండు కోట్లు
గతంతో పోలిస్తే గోదావరి పుష్కరాలకు యూత్రికులు అధికంగా వస్తారనే అంచనాలతో ఇంతకు ముందున్న స్నానఘట్టాలకు అదనంగా మరో 150 మీటర్ల పొడవున నిర్మించారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా వీఐపీల కోసం జ్ఞాణతీర్థం వద్ద మరో స్నానఘట్టాన్ని నిర్మించారు. ప్రధాన స్నానఘట్టాల వద్ద దుస్తులు మార్చుకునే గదులు, వయోవృద్ధులు, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఘాట్లపై షవర్లు ఏర్పాటు చేశారు. గోదావరిలోని ఇన్‌ఫిల్టరేషన్ వెల్ నుంచి పైప్ లైన్ల ద్వారా షవర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు.
 
 అవసరానికి తగినన్ని వసతులు
 కాళేశ్వరంలో జరిగే పుష్కరాలకు తెలంగాణ ప్రాంతంతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీష్‌ఘడ్ రాష్ట్రాల నుంచి సుమారు 15లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి వస్తారని అధికార వర్గాలు అంచనా వేశారు. అందుకు తగినట్టుగానే వసతులు కల్పించారు. తాగునీటి ట్యాంకులు, తాత్కాలిక, శాస్వత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు.

మరిన్ని వార్తలు