కాళేశ్వరం దర్శించినంతనే ముక్తి..

11 Jul, 2015 10:16 IST|Sakshi
క్రిష్ణమూర్తి, కాళేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకులు

పుష్కరస్నానం పుణ్యఫలదాయకం. పితృదేవతలకు పిండ తర్పణాలు, జపాల దానాలు అనాదిగా వస్తున్న సంప్రదాయం. వీటితో మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని నమ్మకం. కాశీలో మరణిస్తే ముక్తి... కానీ, కాళేశ్వరంలో దర్శించినంతనే ముక్తి కలుగుతుందని నమ్మకం. పుష్కర మహత్యం, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ క్షేత్ర మహత్యంపై కాళేశ్వ దేవస్థాన ప్రధాన అర్చకులు క్రిష్ణమూర్తి పలు విషయాలు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...


పుష్కర సమయాల్లో పుణ్యనదీ స్నానం పుణ్యప్రథమని హిందువుల నమ్మకం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషదులు, ఔషదుల నుంచి ఆహారం, ఆహారం నుంచి జీవుడు జన్మించాడు. జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు. పుష్కరం అంటే పన్నెండు. మన దేశంలో పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తుంటాయి. ప్రాణకోటికి ఆధారమైన జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. జలాధాల వెంటనే నాగరికత విస్తరించింది. అలాంటి జలానికి దేవత రూపాన్నిచ్చి తల్లిగా ఆదరించడం హిందూ సంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, మంగళస్నానాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం, శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, పితృతర్పణాలు ఇలా అన్నీ జలంతో ముడిపడినవే. నదీ తీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని ఆచారం.
 
బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తుంటాయి. రాశులు పన్నెండు, ముఖ్యమైన నదులు పన్నెండు. అందుకే పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాదిపాటు ఆ నదికి పుష్కరమే కానీ, సాధారణంగా పుష్కరం ప్రారంభమైన మొదటి 12 రోజులు ఆది పుష్కరం అని, చివరి 12 రోజులు అంత్యపుష్కరమని నిర్వహిస్తుంటారు. పవిత్ర నదుల్లో మానవులు స్నానాలాచరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు.
 
నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రులై బాధపడుతుండగా పుష్కరుడు అనే ప్రభువు బ్రహ్మ కోసం తపస్సుచేసి బ్రహ్మ అనుగ్రహంతో పవిత్రక్షేత్రం గా మారిన పుష్కరుడు పుష్కరతీర్థంగా మారి స్వర్గంలోని మందాకిని నదిలో అంతర్భూతమై 12 ఏళ్లపాటు ఉంటాడు. అటు పిమ్మట ఏటా బృహస్పతి(గురుగ్రహం) ఏ రాశిలో ప్రవేశిస్తుందో... దాని వల్ల ఏ నదికి పుష్కరం వస్తుందో ఆయా నదులను ఆయన దర్శిస్తుంటాడని ఇతిహాసం. స్వయంగా బ్రహ్మ అనుగ్రహం పొందినవాడు వచ్చినప్పుడు సప్తమహారుషులు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని ప్రతీతి. సప్తరుషులు, సమస్త దేవదేవతలు పుష్కర సమయంలో సూక్ష్మదేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదని విశ్వాసం.

(కాశీలో మరణిస్తే ముక్తి కాగా, కాళేశ్వరంలో కేవలం దర్శించినంత మాత్రానే ముక్తి లభిస్తుందని ఇక్కడి మహత్యం. కాళేశ్వరం ఆలయంలో ఒకే పానపట్టంపై ముక్తీశ్వరుడు, కాళేశ్వరుడు ఉండ డం ఇక్కడి ప్రత్యేకత. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీ నదుల కలయికతో త్రివేణి సంగమంగా కాళేశ్వరం పేరుగాంచింది. అందుకే ప్రసిద్ధి పొందింది. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరించటంతోపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడం, జపాలు, ఇతర దానాలు చేయడం సంప్రదాయం.)
 - మహదేవపూర్

మరిన్ని వార్తలు