కాళేశ్వరం విద్యుత్‌ వ్యవస్థ సిద్ధం

6 Aug, 2018 02:02 IST|Sakshi

గడువుకు ముందే ప్రధాన సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తి

రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లకు అవసరమైన విద్యుత్‌కోసం గోలివాడ గ్రామ శివారులో ట్రాన్స్‌మిషన్‌ (సబ్‌స్టేషన్‌) వ్యవస్థ సిద్ధమైంది. నిర్దేశిత గడువుకు ముందే ఈ వ్యవస్థను పూర్తిచేశారు. రాష్ట్రానికి జీవధారగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. గోలివాడ గ్రామ శివారులో 400/220/11 కేవీ సామర్ధ్యం గల విద్యుత్‌ ఉపకేంద్రం ప్రస్తుతం సిద్ధంగా ఉంది.

జూలై 18వ తేదీన ట్రాన్స్‌కో (లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం) డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌ ఈ వ్యవస్థ ట్రయల్‌ రన్‌ ప్రారంభించారని అధికారులు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లోనే పనులు ప్రారంభించిన ఈ ట్రాన్స్‌మిషన్‌ (సబ్‌స్టేషన్‌) వ్యవస్థను 18 మాసాల గడువులోగా పూర్తిచేయాలనే లక్ష్యం విధించగా అధికారులు సగం గడువులోనే పూర్తిచేయడం గమనార్హం. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఎస్‌టీపీపీ) నుంచి గోలివాడ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుంది.

కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 19 సబ్‌స్టేషన్లు నిర్మిస్తుండగా గోలివాడ సబ్‌స్టేషన్‌ ప్రధానమైంది. ఇక్కడి నుంచి గోలివాడ పంపుహౌజ్‌లో ఏర్పాటు చేసిన 9 మోటార్లకు 40 మెగావాట్లు, అన్నారంలో 8 మోటార్లకు 40 మెగావాట్లు, మేడిగడ్డ (కన్నెపల్లి)లో 11 మోటార్లకు 40 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల చివరినాటికి కాళేశ్వరంలో పంపులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు