‘జల’ సంబురం 

22 Jun, 2019 10:50 IST|Sakshi
ఖమ్మంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులు

సాక్షి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో కేక్‌ కట్‌ చేయడంతోపాటు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం.. పార్టీ జెండాలు చేబూని ర్యాలీలు నిర్వహిస్తూ.. బాణసంచా కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ.. ఇందుకోసం ప్రభుత్వం చేసిన కృషిని వివిధ రూపాల్లో ప్రజలకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు పండగలా చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించడంతో ఆ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ.. పలు మండల కేంద్రాల్లోనూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు, పలుచోట్ల వ్యవసాయాధికారులు పలు కార్యక్రమాలు చేపట్టడంతోపాటు రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి జెడ్పీ సెంటర్‌ వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. బాణసంచా కాల్చారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించి.. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌ను కట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మేయర్‌ పాపాలాల్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లైవ్‌ ద్వారా కార్యకర్తలకు పార్టీ కార్యాలయంలో చూపించారు.

తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం వరప్రదాయని అని, దీనికోసం సీఎం కేసీఆర్‌ చేసిన కృషి, పడిన శ్రమ అపారమైందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ అన్నారు. అలాగే దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధన కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి.. స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతను వివరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును అపర భగీరథుడిగా అభివర్ణించారు.

మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు. వైరాలో నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు. సత్తుపల్లిలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ సంబరాల్లో పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.

మరిన్ని వార్తలు