కాలంతో నడిచిన కవి కాళన్న

9 Sep, 2018 12:49 IST|Sakshi
 కాళోజీ

మహోన్నత మూర్తిపూలలాలిత్యంవజ్ర కాఠిన్యంతనువంతా నింపుకున్నధిక్కార స్వరంభాషకు యాసకు పట్టం కట్టికవితా యాత్ర చేసిన తెలంగాణ చైతన్యందుర్భర జన జీవితాన్నిదగ్గరగా దర్శించి ప్రజాస్వామ్యాన్ని పాతరేసేపాలక రక్కసులను ప్రశ్నించిన పౌరహక్కుల స్వరం ఎవరికీ వెరవని నైజం మానవత్వం పరిమళించే తేజంకాలాన్ని వ్యాఖ్యానించిన కవిత్వం కర్తవ్యాన్ని బోధించిన ధీరత్వం మన కాళోజీమహోన్నత మూర్తి మన కాళోజీమనందరికీ స్ఫూర్తి..–వల్స పైడి, కవి,ఉపాధ్యాయుడు 

హన్మకొండ కల్చరల్‌(వరంగల్‌): ‘రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ల యాస తొక్కి నొక్కబడ్డప్పుడు  ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు’ అని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తన కవిత్వంలో ప్రస్తావించిన ప్రజాకవి కాళోజీ పది జిల్లాల తెలంగాణ భాషపై రెండున్నర జిల్లాల ఆంధ్రభాష పెత్తనం చేయడం, ఇక్కడి భాషను తక్కువగా చూడడంపై మండిపడ్డారు. తెలంగాణ భాషను, మాట తీరును ఎవరు కించపరిచినా ఆయన సహించేవారు కాదు. అందుకే కాళోజీ నారాయణరావు జయంతిని కొన్నేళ్లుగా తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా భాషాభిమానులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా కాళోజీ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 9ని తెలంగాణ భాష దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ మట్టిని, భాషను, మనుషులను ఎంతగానో ప్రేమించిన కవి కాళోజీ. 

కాళోజీ 104వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 
కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్‌ 9న రంగారావు, రమాబాయి దంపతులకు నాటి నిజాం సంస్థానంలోని బీజాపూర్‌ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరాం రాజా కాళోజీ పూర్తి పేరు. బీజాపూర్‌ నుంచి తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. దీంతో కాళోజీ మడికొండలో ప్రాథమిక విద్యం, హన్మకొండ, హైదరాబాద్‌లలో ఉన్నతవిద్య అభ్యసించారు. ఆయన 15 ఏళ్ల వయస్సు నుంచే రాజకీయ ఉద్యమాల్లో, కవితా, రచనావ్యాసంగాల్లో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ , నిజాం స్టేట్‌ కాంగ్రెస్‌లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు.

ప్రవక్తలా బోధించిన కవి..
 కాళోజీ వంటి ప్రజాస్వామ్య విలువలు బోధించిన ప్రజాస్వామిక ప్రవక్త మరో వెయ్యి సంవత్సరాలకుగాని పుట్టబోరని ప్రముఖ న్యాయవాది, పీయూసీఎల్‌ నేత కన్నాభిరాన్‌ వ్యాఖ్యానించడం అతిశయోక్తి కాదు. కాళోజీ జీవించిన కాలంలో జీవించడంతోనే మనం ధన్యులమైనట్లని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కాళోజీ అవార్డు అందుకుంటున్న అంపశయ్య  నవీన్‌ వ్యాఖ్యానించారు.


మాతృభాష రాదన్న వారిపై విసుర్లు.. 
1942లో నిజాం రాష్ట్రంలో తెలుగు ప్రజలు తమ మాతృభాష అయిన తెలుగు భాషపై నిరాదరణతో ఉండడం   చూసి  స్పందించి ‘ఏ భాషరా నీది యేమి వేషమురా? /ఈ భాష.. ఈ వేషమెవరి కోసమురా? / అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు.
 
పార్టీల నిషేధంపై ఆగ్రహం..
1946లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ఆయన ఘాటుగా స్పందించారు. ‘ప్రజాసంస్థలపై పగ సాధించిన ఫలితం తప్పక బయటపడున్‌/నిక్కుచునీల్గే నిరంకుశత్వం/నిల్వలేక నేలను గూలున్‌/చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను/స్థిరమగు కట్టయు శిథిలమగున్‌..’ అంటూ హెచ్చరించారు.

నిజాం ప్రధానిని ప్రశ్నించిన కాళోజీ..
1946లోనే వరంగల్‌ కోటలో మొగిలయ్య హత్య జరిగింది. మరోచోట పసిబాలుడిని పొడిచారు. శిక్ష చంపిన వారికి వేయాల్సిందిపోయి జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలలపాటు దేశబహిష్కార శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఇక్కడి సంఘటనలపై విచారణ చేయాడానికి  వచ్చిన ప్రధాని సర్‌ మీర్జాఇస్మాయిల్‌ను కాళోజీ తన కవిత ద్వారా ప్రశ్నించారు. ‘ఇది అందరికి చిరపరిచితమే ఎన్నాళ్ల నుండియో ఇదిగో అదిగో అనుచూ ఈనాటికైనను ఏగివచ్చితివా? కోట గోడల మధ్య ఖూనీ జరిగిన చోట గుండాల గుర్తులు గోచరించినవా బజారులో బాలకుని బల్లెంబుతో పొడుచు బద్మాషునేమైనా పనిబట్టినావా మొగిలయ్య భార్యతో, మొగిలయ్య తల్లితో మొగమాటము లేక ముచ్చటించితివా? కాలానుగుణ్యమగు కాళోజీ ప్రశ్నలకు కన్నులెర్రగా చేసి ఖామూష్‌ అంటావా?...’ అంటూ సర్‌ మీర్జాఇస్మాయిల్‌ను ప్రశ్నించారు. కాళోజీ తన భావాలకే కాదు శరీరానికి మరణం లేదని నిరూపించిన వ్యక్తి. అందుకే ఆయన మరణాంతరం తన శరీరాన్ని కాకతీయ మెడికల్‌ కళాశాలకు అప్పగించేలా విల్లు రాసిచ్చారు. దీంతో ఆయన కోరిక మేరకు కేఎంసీకి ఆయన పార్థీవదేహాన్ని అప్పగించారు.
 
శతజయంతి ఉత్సవాలతో మలుపు...
2002లో కాళోజీ కన్నుమూసిన తర్వాత కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్‌తోపాటు జిల్లాలోని ఇతర సాహిత్య సంస్థలు కాళోజీ జయంతి, వర్ధంతులను నిర్వహించేవి. అంతేగాక కాళోజీ జయంతిని మాండలికభాషా దినోత్సవంగా ప్రకటించాలని కాళోజీ అభిమానులు, అనుచరులు చాలాకాలంగా కోరుతూ వచ్చారు. అప్పటి ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. అయితే 2014 సెప్టెంబర్‌ 9 నుంచి 2015 సెప్టెంబర్‌ 9 వరకు నిర్వహించిన కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని తెలంగాణ భాషదినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అంతేగాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతీసుకుని కాళోజీ పేరిట రవీంద్రభారతి కంటే పెద్ద ఆడిటోరియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే బాలసముద్రంలో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తికాలేదు. కాళోజీ పేరిట జిల్లాలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక అంశాలపై బో ధన, పరిశోధన జరిగేలా విశ్వవిద్యాలయం ఏర్పా టు చేయాలని సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కాళోజీ అభిమానులు కోరుతున్నారు.

చేపట్టిన పదవులు..
 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగా , ఆంధ్రసారస్వత పరిషత్తు , ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలలో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
రచనలు
అణా కథలు, నా భారతదేశయాత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, తుదివిజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇదీ నా గొడవ, బాపూ!బాపూ!!బాపూ!!!  

  • 1992: పద్మవిభూషణ్‌  
  • 1968 : ‘జీవన గీత’ రచనకు రాష్ట్ర
  • ప్రభుత్వంచే అనువాద పురస్కారం.
  • బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్‌ మొదటి పురస్కారం, ప్రజాకవి బిరుదు
  • 1972 : తామ్రపత్ర పురస్కారం 
  • 1992 : కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌
  • 1996 : సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు
  • 1996 : కళాసాగర్‌ మద్రాస్‌ వారి విశిష్ట పురస్కారం   
మరిన్ని వార్తలు