ఆరోగ్య వర్సిటీకి అనారోగ్యం!

13 May, 2018 01:50 IST|Sakshi

      దయనీయ స్థితిలో కాళోజీ విశ్వవిద్యాలయం 

      నాలుగేళ్లుగా కనీస స్థాయిలో లేని పరిపాలన వ్యవహారాలు 

      ఒక్క రెగ్యులర్‌ పోస్టూ భర్తీ చేయని సర్కారు 

      దగ్గరపడుతున్న వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియ 

      పరిస్థితి మారకుంటే అడ్మిషన్లు, కోర్సుల నిర్వహణలో ఇబ్బందులే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. కనీస స్థాయిలో పరిపాలన వ్యవహారాలు జరగడంలేదు. మరోవైపు వైద్య విద్య కోర్సుల నిర్వహణలో ఏటా కొత్త మార్పులు వస్తున్నాయి. ఎంబీబీఎస్, డెంటల్, పీజీ మెడికల్, నర్సింగ్, ఆయుష్‌ వంటి అన్ని కోర్సుల సీట్లు ఇప్పుడు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఆధారంగానే భర్తీ అవుతున్నాయి. గతంలో బీ, సీ కేటగిరీ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భర్తీ చేసుకునేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

వంద శాతం సీట్లను కాళోజీ వర్సిటీనే భర్తీ చేయాల్సి ఉంటోంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య డిగ్రీ, పీజీ సీట్లు అన్నీ కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ అవుతాయి. అన్ని కోర్సులు కలిపి ఏడాది పొడవునా అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియలు ఉంటున్నాయి. దీంతో వర్సిటీ పని భారం గతంలో కంటే పెరిగింది. అయితే అందుకు అనుగుణంగా పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్సిటీలో కనీస స్థాయిలో పరిపాలన వ్యవస్థ ఏర్పాటు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించడం లేదు. 2018–19 ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్‌ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ వచ్చే నెలలో మొదలుకానుంది. పరిస్థితి మారకుంటే వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియలో, కోర్సుల నిర్వహణలో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఒక్క పోస్టూ భర్తీ కాలేదు.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య నిర్వహణ కోసం విజయవాడలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో వైద్య విద్య కోసం కాళోజీ విశ్వవిద్యాలయాన్ని 2014 సెప్టెంబర్‌ 26వ తేదీన వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేశారు. వైస్‌ చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో నియమించింది. అనంతరం విశ్వవిద్యాలయం నిర్వహణకు 82 రెగ్యులర్‌ పోస్టులను, 22 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను మంజూరు చేస్తూ 2016 జనవరి 19వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోస్టుల భర్తీకి అనుమతి వచ్చి రెండేళ్లు గడిచినా విశ్వవిద్యాలయంలో ఒక్క రెగ్యులర్‌ పోస్టును కూడా భర్తీ చేయలేదు. వైద్య శాఖలో, ఇతర విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 21 మందిని డిప్యూటేషన్‌ పద్ధతిలో కాళోజీ వర్సిటీలో నియమించారు.

అధికార పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఏడాది క్రితం ఓ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీని ఎంపిక చేశారు. అలా ఔట్‌సోర్సింగ్‌ కేటగిరీలోని పోస్టులను ఈ సంస్థ ద్వారా భర్తీ చేశారు. కానీ రెగ్యులర్‌ పోస్టుల భర్తీ విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటివరకూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గానీ, ఆ శాఖ ఉన్నతాధికారులు గానీ ఒక్కసారి కూడా యూనివర్సిటీ పరిస్థితిపై సమీక్షించలేదు. పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో రాష్ట్రంలోని ఏకైక ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పరిపాలన తీరు గందరగోళంగా మారుతోంది.

మరిన్ని వార్తలు