మహిళాబిల్లు తెస్తే మద్దతిస్తాం

17 Nov, 2018 01:31 IST|Sakshi
గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో యంగ్‌ థింకర్స్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కవిత

టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెడితే టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. శుక్రవారం ఇక్కడి గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)లో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌ హైదరాబాద్, ఐఎస్‌బీ సంయుక్త ఆధ్వర్యంలో 2018 ‘యంగ్‌ థింకర్స్‌ కాన్ఫరెన్స్‌’లో కవిత మాట్లాడారు. చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారానే రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెరుగుతుందన్నారు. లోక్‌సభలో 542 మంది సభ్యుల్లో 64 (11శాతం), రాజ్యసభలో 245 మందికి 27 మంది(11 శాతం) మహిళలు మాత్రమే ఉన్నారని, అన్ని రాష్ట్రాల్లో కలిపి 4,198 మంది ఎమ్మెల్యేలుండగా అందులో 9 శాతమే మహిళా ఎమ్మెల్యేలున్నారని ఆమె వివరించారు. మనీ, మీడియా, మెన్‌ అనే ఈ మూడు అంశాలతో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

ప్రతి ఆడపిల్లను చదివించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 3 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ల ఇళ్లను మహిళల పేరిట ఇస్తున్నామన్నారు. దళితులకు 3 ఎకరాల భూపంపిణీలో భాగంగా ఇప్పటివరకు 13,000 మందికి పట్టాలివ్వగా అవన్నీ మహిళల పేరిటే ఉన్నాయని చెప్పారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల రాష్ట్ర ఇన్‌చార్జీ స్వాతి లక్రా మాట్లాడుతూ షీటీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటుతో మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. కార్యక్రమంలో బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్య్రూ ఫ్లెమింగ్, ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ ప్రొఫెసర్‌ మిలింద్‌ సోహానీ, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్, టీఆర్‌ఈఎస్‌ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఇండియన్‌ నెవీ లెఫ్టినెంట్‌ కమాండర్‌ ఐశ్వర్య బొడ్డపాటి, భారత పర్వాతారోహకులు మాలావత్‌ పూర్ణ, జాహ్నవి శ్రీపెరంబుదూరు, సామాజికవేత్త తెమ్సుతుల ఇమ్సాంగ్‌లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు