కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం రివ్యూ

3 Nov, 2018 10:39 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంటింటి ప్రచారాన్ని తీవ్రం చేశారు. అందులో భాగంగా ప్రతీ ఓటరును కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని పాతపాలమూర్‌లో ప్రచారం సాగింది. మార్గమధ్యలో ఓ ఇంటి ఎదుట కట్టెల పొయ్యి కనిపించగా.. కొద్దిసేపు గొట్టంతో ఊది మంట రగిలించారు. వంట త్వరగా పూర్తయ్యేలా మంట రగిలించిన తనకే ఓటు వేయాలని వారికి కోరారు. జెడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌) 

 భాయ్‌.. జర దేఖో...
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు అంది వచ్చే ఏ అవకాశాన్ని విడుచుకోవడం లేదు. శుక్రవారం ప్రార్థనలకు ముస్లింలు తప్పక మస్జీద్‌కు వస్తారని.. అక్కడైతే ఎక్కువ మందికి కలవొచ్చన భావనతో దేవరకద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కొత్తకోటలోని మస్జీద్‌ దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రార్థన పూర్తిచేసుకుని బయటకు వస్తున్న ముస్లింలను కలిసి ఓటు అభ్యర్థించారు. – కొత్తకోట రూరల్‌   

టీ బ్రేక్‌..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జడ్చర్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఎడ్లబండిపై ముందుకు సాగుతూ సందడి చేసిన ఆయన నవాబుపేట మండల కేంద్రంలో గోపాల్‌ టీ షాప్‌ కనిపించగానే కొద్దిసేపు ఆగారు. అక్కడ తనతో పాటు నాయకులు, కార్యకర్తలందరికీ టీ ఇప్పించి తాగాక మళ్లీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. – నవాబుపేట (జడ్చర్ల) 

కుట్టు లాగే అభివృద్ధిలో తేడా రాదన్నా !

కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని నారాయణపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.రాజేందర్‌రెడ్డి తన ప్రచారంలో చెబుతున్నాఉ. ఈ మేరకు శుక్రవారం ఆయన దామరగిద్ద మండలంలోని కాన్‌కుర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులతో పాటు కుల వృత్తుల్లో నిమగ్నమైన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో చెప్పులు కొడుతున్న ఓ వ్యక్తితో మాట్లాడారు. – దామరగిద్ద (నారాయణపేట)  

ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం 
ఈ నియోజకవర్గానికి 16 దఫాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1962లో వెంకట్‌రెడ్డి, 1967లో ద్యాప గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వడంతో 1969లో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడే ఎస్‌.జైపాల్‌రెడ్డి రాజకీయ అరగేట్రం చేసి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 1994లో ఎడ్మ కిష్టారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.   

నియోజకవర్గ ప్రత్యేకతలు 
నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి నెలవు. దీంతోపాటు కరవు, వలసలకు కూడా నిలయంగా నిలుస్తోంది. ఇక్కడ పెద్దగా ఎలాంటి పరిశ్రమలు లేవు. మూడు స్పిన్నింగ్‌ మిల్లులు, ఆరు జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. కడ్తాల్‌ మండలంలో మైసిగండి ఆలయం ప్రత్యేకత. ఇక్కడికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు వస్తుంటారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంబంధించి కాల్వలు పూర్తికావడంతో కొంత ప్రాంతానికి సాగునీరు అందుతోంది. గోకారం రిజర్వాయర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కాల్వలు తవ్వి నీరు పారించాల్సి ఉంది.  

గత ఎన్నికల్లో రీపోలింగ్‌
2014లో జరిగిన ఎన్నికల సందర్బంగా కూడా అన్ని నియోజకవర్గాలతో పాటు 2014 మే 16న కల్వకుర్తి ఫలితం వెల్లడించలేకపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలోని జూపల్లి గ్రామంలోని 119 నంబర్‌ పోలింగ్‌ బూత్‌కు చెందిన ఈవీఎం సాంకేతికత లోపంతో పనిచేయలేదు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. నిపుణులు వచ్చి సరిచేస్తారేమోనని రాత్రి 9.30 గంటలకు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అప్పటికి వాయిదా వేశారు. అయితే, ఆ సమయానికి 28 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి 42,229 ఓట్లు, సమీప బీజేపీ అభ్యర్థి టి.ఆచారికి 42,197 ఓట్లు వచ్చాయి. అంటే వంశీకి 32 ఓట్ల ఆధిక్యం ఉంది.

దీంతో చివరి 109 పోలింగ్‌ బూత్‌ ఓట్లు లెక్కిస్తే ఫలితం తేలేది. కానీ ఈవీఎంలో సాంకేతిక లోపంతో వాయిదా పడ్డాయి. ఇక 19వ తేదీన ఆ ఒక్క బూత్‌కు సంబంధించి రీ పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ బూత్‌కు సంబంధించి 1,140 ఓట్లలో 1,132 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మొత్తంగా వంశీకి 42,782 ఓట్లు, ఆచారికి 42,704 ఓట్లు వచ్చినట్లు తేలడంతో 78 ఓట్ల మెజార్టీతో వంశీచంద్‌రెడ్డి గెలిచినట్లు ప్రకటించారు. కాగా, 119 నంబర్‌ బూత్‌లో మొదటిసారి పోలింగ్లో 633 ఓట్లు పోల్‌ కాగా.. రీ పోలింగ్‌లో 1,132 ఓట్లు పోల్‌ కావడం విశేషం.

ఎన్టీఆర్‌ ఓటమి ఓ సంచలనం జైపాల్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం ఇక్కడి నుంచే.. గత ఎన్నికల్లో రీ పోలింగ్‌ ద్వారా ఫలితాలు ముగ్గురు స్వతంత్రులకు దక్కిన విజయం.. ఇద్దరికి మంత్రి పదవులు కూడా... రెండు జిల్లాల పరిధిలో విస్తరించిన నియోజకవర్గం

కరువుకు నిలయం
కల్వకుర్తి నియోజకవర్గం రాజకీయాల్లో సంచలనం సృష్టించినట్లుగానే... కరువుకు కేరాఫ్‌గా నిలుస్తోంది. సాగు, తాగునీరు లేక కరవుతో రైతులు, ప్రజలు విలవిలలాడే ప్రాంతం. ఇక్కడి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోయేవారు. ఈ ప్రాంత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అంజయ్య సీఎంగా ఉన్న సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే, పనుల్లో జాప్యం.. పాలకుల నిర్లక్ష్యంతో కేఎల్‌ఐ పనులు ఎన్నికల హామీలుగా మిగిలిపోయాయి. అయితే, దివంగత మహానేత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో కాల్వలు తవ్వించారు. ఇక టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నీళ్లు పారించి కొన్ని గ్రామాలకు సాగునీరు అందించడం ద్వారా రైతుల కళ్లలో ఆనందం నిండినట్లయింది. ఇక హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఈ ప్రాంతం నిలయంగా మారింది. 

1989లో సంచలనం
కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి 1989లో పెను సంచలనం నమోదైంది. ఈ ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ.రామారావు పోటీకి దిగారు. ఎన్టీఆర్‌కు అప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జైపాల్‌రెడ్డి మద్దతు తెలిపి పోటీకి దింపారు. అంతకుమందు 1985 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన చిత్తరంజన్‌దాస్‌ 1989లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్టీఆర్‌కు పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 50,786 ఓట్లు రాగా, చిత్తరంజన్‌దాస్‌కు 54,354 ఓట్లు రావడంతో.. ఎన్టీఆర్‌ 3,568 ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక ఎన్టీఆర్‌ ఓడించడంతో చిత్తరంజన్‌దాస్‌కు అప్పట్లో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా స్థానం దక్కింది. 

ఇద్దరికి మంత్రి యోగం
ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిలో కేవలం ఇద్దరికే మంత్రి పదవులు దక్కాయి. కల్వకుర్తి ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన తలకొండపల్లికి చెందిన మందుగుల నర్సింహరావు(ఎం.ఎన్‌.రావు)కు మంత్రి పదవి దక్కింది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, రయత్‌ పత్రికా సంపాదకులు. ఆ తర్వాత ఎన్టీరామారావును ఓడించిన చిత్తరంజన్‌దాస్‌ కార్మిక శాఖ మంత్రిగా నియామకయ్యారు. 

కల్వకుర్తి
నియోజకవర్గ ప్రజలను రాజకీయ చైతన్యానికి మారుపేరుగా చెప్పొచ్చు. ఈ నియోజకవర్గానికి అంతటి ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పునిస్తారని ప్రతీతి. ఉత్తమ పార్లమెంటేరియన్‌ అయిన కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి ఇక్కడే రాజకీయ ఓనమాలు దిద్దింది. 1969 నుంచి వరసగా నాలుగు దఫాలు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే జనతా పార్టీ నుంచి జైపాల్‌రెడ్డి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందటం మరో విశేషం! ఆ తర్వాత ఆయన మద్దతు ఇచ్చిన ఓ ప్రభంజనమైన నాయకుడు, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన ఎన్టీ రామారావు బీసీ నాయకుడు చిత్తరంజన్‌ దాస్‌ చేతిలో ఓటమి చెందడంతో ఈ నియోజకవర్గం పేరు దేశ రాజకీయాల్లో మార్మోగింది. ఇక గత ఎన్నికల్లో ఒక ఈవీఎం తెరుచుకోక జూపల్లి గ్రామంలోని పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో రీపోలింగ్‌ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 


2014 ఎన్నికల్లో పోలైన ఓట్లు ; అభ్యర్థి   పార్టీ    లభించిన ఓట్లు 

చల్లా వంశీచంద్‌రెడ్డి    కాంగ్రెస్‌    42,782 
తల్లోజి ఆచారి    బీజేపీ    42,704 
జి.జైపాల్‌యాదవ్‌  టీఆర్‌ఎస్‌    29,844 
కసిరెడ్డి నారాయణరెడ్డి  స్వతంత్రం    24,095 

1952 నుంచి 16 పర్యాయాలు ఎన్నికలు:

కల్వకుర్తి నియోజకవర్గం 1952, 1957లో ద్విసభ్య స్థానంగా ఉండేది. ఆ తర్వాత 1962 నుంచి ఏకసభ్య స్థానంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. 16 పర్యాయాలు ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా మూడు సార్లు స్వతంత్రులు, రెండు దఫాలు జనతాపార్టీ, రెండు దఫాలు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదట తాలూకాలోని పంచాయితీç సమితిలు కల్వకుర్తి, ఆమగనల్లు కలిపి ఎమ్మెల్యే ఎన్నికలు జరిగేవి. మండలాల తర్వాత ఈ నియోజకవర్గంలో మిడ్జిల్‌ మండలంతో పాటు కల్వకుర్తి, వంగూరు మండలాలకు చెందిన కొన్ని గ్రామాలతో కలిపి ఏడు మండలాలు ఉండేవి.

 1999లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా మిడ్జిల్‌ మండలం జడ్చర్లకు వెళ్లగా.. వంగూరు మండలం పూర్తిగా అచ్చంపేట నియోజకవర్గంలో కలిసింది. కల్వకుర్తి మండలంలోని నాలుగు గ్రామాలే ఈ నియోజకవర్గంలో ఉండేవి. ఆ తర్వాత మండలం పూర్తిగా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఐదు మండలాలే పూర్తిగా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక 2016లో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునఃర్విభజనలో నియోజకవర్గంలోని మూడు మండలాలు ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లగా... కల్వకుర్తి, వెల్దండ మాత్రమే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మిగిలాయి. 

ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని వెల్దండ, వంగూరు మండలాల నుంచి విడదీసిన గ్రామాలతో చారగొండ మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేయగా.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్‌ మండలాన్ని విడదీసి కడ్తాల్‌ మండలాన్ని ఏర్పాటుచేశారు. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ఏడు మండలాలతో కొనసాగుతోంది. అంతేకాకుండా నూతనంగా గ్రామపంచాయతీలతో పాటు తండాలు ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. ఈ మార్పులతో మొదటి సారి ఎన్నికలు జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. 

కల్వకుర్తి ప్రొఫెల్‌:

నియోజకవర్గం క్రమసంఖ్య    83 

పోలింగ్‌ స్టేషన్లు                  257 
మండలాలు  కల్వకుర్తి, వెల్దండ, 
చారగొండ, ఆమనగల్, 
మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్‌ 

2014లో మొత్తం ఓటర్లు    1,99,714 
పురుషులు                    1,02,349 
మహిళలు                       97,350 
ఇతరులు                        15 

ప్రస్తుతం మొత్తం ఓటర్లు    1,98,444 
పురుషులు                    1,01,956 
మహిళలు                      96,464 
ఇతరులు                       24 

ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు వీరే 
సంవత్సరం        విజేత        పార్టీ 
1952 (ద్విసభ)    ఎం.ఎన్‌.రావు        కాంగ్రెస్‌ కేఆర్‌.వీరస్వామి        కాంగ్రెస్‌.

1957 (ద్విసభ) నాగన్నకాంగ్రెస్‌ శాంతాబాయి        కాంగ్రెస్‌.
1962        వెంకట్‌రెడ్డి             స్వతంత్ర 
1964 (ఉ.ఎ.)    శాంతాబాయి    కాంగ్రెస్‌     
1967        ద్యాప గోపాల్‌రెడ్డి      స్వతంత్రం 
1969 (ఉ.ఎ)        జైపాల్‌రెడ్డి     కాంగ్రెస్‌ 
1972        ఎస్‌.జైపాల్‌రెడ్డి        కాంగ్రెస్‌ 
1978        ఎస్‌.జైపాల్‌రెడ్డి        జనతా పార్టీ 
1983        ఎస్‌.జైపాల్‌రెడ్డి        జనతాపార్టీ 
1985        జె. చిత్తరంజన్‌దాస్‌   కాంగ్రెస్‌ 
1989        జె.చిత్తరంజన్‌దాస్‌    కాంగ్రెస్‌ 
1994        ఎడ్మ కిష్టారెడ్డి          స్వతంత్రం 
1999        జి.జైపాల్‌యాదవ్‌     టీడీపీ 
2004        ఎడ్మ కిష్టారెడ్డి           కాంగ్రెస్‌ 
2009        జైపాల్‌యాదవ్‌         టీడీపీ 
2014        చల్లా వంశీచంద్‌రెడ్డి    కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు