త్వరగా పూర్తిచేయండి

3 May, 2018 11:56 IST|Sakshi
టన్నెల్‌లో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిరిసిల్ల : రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్యాకేజీ–9 టన్నెల్, మల్కంపేట రిజర్వాయర్‌ నిర్మాణాలను ఆయన పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం తెస్లాపూర్‌లోని ప్యాకేజీ – 10 కింద చేపడుతున్న సర్జ్‌పూల్‌ టన్నెల్‌ను కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఇరిగేషన్‌ అధికారులతో కలసి పరిశీలించారు. ప్యాకేజీ – 9 లోని రగుడు నుంచి మల్కంపేట, కొలనూరు, పాతిరెడ్డిపల్లె వద్ద కొనసాగుతున్న పనులు పరిశీలించారు.

రగుడు నుంచి మల్కంపేట రిజర్వాయర్‌ వరకు నిర్మిస్తున్న 12 కి.మీ సొరంగ మార్గం పనుల్లో 9 కి.మీ మేర పూర్తి కాగా మరో 3 కి.మీ పనులు మిగిలి ఉన్నాయని మంత్రి తెలిపారు. మల్కంపేట రిజర్వాయర్‌ పనులు పూర్తి నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. కొలనూరు రిజర్వాయర్‌ను మల్కంపేట రిజర్వాయర్‌కు అనుసందానించే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు.

మల్కంపేటలో 200 డబుల్‌ బెడ్రూం ఇళ్లు..

మల్కంపేట రిజర్వాయర్‌ చుట్టూ ఉన్న గ్రామాల పేదలకు, భూములు కోల్పోయిన వారికి 200 డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. త్రి వెంట డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, ఈఈ బుచ్చిరెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు