ఇంట్లో ఎందరున్నా ‘కల్యాణ లక్ష్మి’

5 Jan, 2017 02:38 IST|Sakshi
ఇంట్లో ఎందరున్నా ‘కల్యాణ లక్ష్మి’

అసెంబ్లీలో మంత్రి జగదీశ్‌రెడ్డి
లబ్ధిదారులకు వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయం

సాక్షి, హైదరాబాద్‌: కల్యాణలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని విద్యుత్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఒక ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా అందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో టీఆర్‌ఎస్‌ సభ్యురాలు కొండా సురేఖ, బీజేపీ పక్షనేత జి.కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కల్యాణలక్ష్మి పథకం తెచ్చేందుకు కారణమైన ఉదంతాన్ని మంత్రి ఈ సందర్భంగా సభకు వివరించారు. ‘‘చెత్తకుండీ వద్ద పసికందును పందులు పీక్కుతిన్నాయన్న వార్తను పత్రికల్లో చదివి ముఖ్య మంత్రి చలించిపోయారు. దీనిపై అధికా రులతో రోజంతా చర్చించారు. ఆడపిల్లలను గర్భంలోనే ఎందుకు తీసేస్తున్నారన్న దానిపై సమీక్షించారు.

ఆడపిల్లల పెళ్లిళ్లు భారం అవుతాయన్న కారణంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గుర్తించారు. ఆడపిల్లల వివాహాలు మనమే చేద్దామని నిర్ణయించి పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి కల్యాణలక్ష్మి పేరు పెట్టింది మంత్రి కేటీఆర్‌..’’ అని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 81 వేలకుపైగా అర్హులకు లబ్ధి చేకూరిందని, పెండింగ్‌లో ఏవైనా దరఖాస్తులు ఉంటే నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఆర్యస మాజ్‌లో వివాహం చేసుకున్న వారికి కళ్యాణలక్ష్మి వర్తింప జేయాలని టీడీసీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కోరగా.. పెళ్లి ఎక్కడ చేసుకు న్నా ఆధారాలు చూపితే పథకం వర్తిస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్‌ సభ్యుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... స్పీకర్, మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గాల్లో తక్కువ మంది లబ్ధిదారులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై అధికార పక్షం నేతలు స్పందిస్తూ.. అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదని సమాధానం రావడంతో అంతా నవ్వుకున్నారు.

మరిన్ని వార్తలు