కల్యాణలక్ష్మికి నిధుల వరద

26 May, 2015 02:33 IST|Sakshi
కల్యాణలక్ష్మికి నిధుల వరద

ఇందూరు : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిధుల కొరతతో అబాసుపాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద దళిత, గిరిజన యువతుల పెళ్లిళ్లకు ఆపన్న హస్తంగా మారిన ఈ రెండు పథకాలకు నిధులను పుష్కలంగా కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చినెలతో ముగిసి పోవడంతో, ఆ తరువాత దరఖాస్తుచేసుకున్న లబ్ధిదారులకు 2015-16 ఆర్థిక సం వత్సరంలో నిధుల వరదను పారించింది.

సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ. ఐదు కోట్ల చొప్పున మంజూరు చేసి వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది.
 
అధికారుల హడావుడి
2015-16 సంవత్సరానికి సంబంధించిన కొత్త బడ్జెట్ రావడానికి కాస్త ఆలస్యం కావడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. సకాలంలో నిధులు అందకుండానే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొందరు పెళ్లి తేదీ దగ్గర పడటంతో నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం నిధులు రావడంతో వందల సంఖ్యలో ఉన్న లబ్దిదారుల ఖాతాలలో ట్రెజరీ నుంచి బ్యాంకు ద్వారా నిధులు వేసేందుకు అధికారులు హడావుడి చేస్తున్నారు. అర్హులను గుర్తించేందుకు తర్జనభర్జన పడు తున్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు మూ   డు రోజులలో బ్యాంకు ఖాతాల్లో నిధులు వేస్తామని లబ్ధిదారులకు సర్ది చెబుతున్నారు. మొత్తానికి ఈసారి నూతన వధువులకు మేలు జరిగినట్టే.
 
గిరిజన సంక్షేమ శాఖకు తక్కువ నిధులు
రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం కింద ఎస్‌సీ సంక్షేమ శాఖకు రూ. ఐదు కోట్లు, షాదీ ముబారక్ పథకం కింద మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.ఐదు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతానికి రూ.75 లక్షలను మాత్రమే విడుదల చేసిం ది. విడుతలవారీగా నిధులు వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు