‘కల్యాణ’ కమనీయం ఏదీ.?

7 Nov, 2019 11:27 IST|Sakshi

సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్‌): పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు లబ్ధిదారుల దరి చేరడం లేదు. పెళ్లి పందిరిలోనే అర్హులైన పేదింటి ఆడపిల్లకు చెక్కులు అందిస్తామన్న ప్రభుత్వం పథకం సాగదీత పథకంగా మారింది. వివాహం జరిగి నెలలు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

పెండింగ్‌లో వందలాది దరఖాస్తులు..
జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కోసం గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకూ 3771 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1361 మందికి డబ్బులు అందజేశారు. మిగిలిన వాటిలో 23 తహసీల్దార్‌ పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి.

తహసీల్దార్‌ వెరిఫికేషన్‌ స్థాయిలో 357 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఎమ్మె ల్యే పరిశీలనలో 410, ఎమ్మెల్యే ఆప్రూవల్‌ అనంతరం మంజూరు స్థాయిలో 1583 ఉన్నారు. ఇటీవల 37 దరఖాస్తుల డబ్బులు మంజూరై ట్రెజ రీలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 

నిధుల విడుదలలో తీవ్ర జాప్యం..
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా ప్రభుత్వం వివాహ కానుకగా మొదట రూ.51వేలు అందించింది. తర్వాత కానుకను రూ.1,00, 116/– కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు మురిసిపోయారు. కాని చెక్కుల మంజూరులో తీవ్ర జా ప్యం జరుగుతుండడంతో నిరాశలో మునిగారు. మరోవైపు ఈ పథకాల దరఖాస్తులు తహసీల్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వర కూ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి.

పథకంపై ఆశలు పెట్టుకుని ఆడ పిల్లల పెళ్లిలు పూర్తి చేసిన తల్లిదండ్రులు తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. దీనికి తోడు చెక్కుల కోసం నిత్యం తహసీల్‌ కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డబ్బులు మంజూరు చేసి ఆదుకోవాలని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులు కోరుతున్నారు.

కళ్యాణలక్ష్మీ ఆలస్యంతో సరోజ స్పందన
రెబ్బెన మండలంలోని గోలేటి పంచాయతీ పరిధి భగత్‌సింగ్‌ నగర్‌. జనరల్‌ స్టోర్స్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో రెండో కూతురుకి వివాహం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు వస్తాయనే భరోసాతో అప్పు చేసి మరీ కల్యాణం జరిపించింది. వివాహ అనంతరం పథకం కోసం దరఖాస్తు చేసుకోగా నేటికీ ఒక్క పైసా కూడా రాలేదు. దాదాపు 10 నెలలుగా ఈ కానుక కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమస్య ఒక్క సరోజది మాత్రమే కాదు. జిల్లాలో గతేడాది నుంచి వివాహాలు జరిపిన అర్హులైన ప్రతి తల్లిదండ్రులది.

నిధులు మంజూరు కావాల్సి ఉంది
జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తమే. అయితే జిల్లాస్థాయిలో చాలా తక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేయాల్సిన దరఖాస్తుల సంఖ్యే అత్యధికంగా ఉంది. ఇటీవల 37 మందికి బిల్లులు మంజూరు కాగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. మిగిలిన వాటి కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతాయి.  – సిడాం దత్తు, ఆర్డీవో 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా