కటాక్షించని ‘కల్యాణలక్ష్మి’!

15 Apr, 2019 07:12 IST|Sakshi

బోథ్‌: పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి చెక్కులు అందడం లేదు. చాలా వరకు దరఖాస్తులు ఆయా తహసీల్దార్‌ కార్యాయాల్లోనే మూలుగుతున్నాయనీ, వాటిని పట్టించుకునే వారే లేకుండా పోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మాత్రం పెళ్లి సమయంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ‘నవ్వ రాములు’లాగానే ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు ఆ చెక్కులేవో ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లాలో మొత్తం 18 మండలాలు, 467 పం చాయతీలు ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,146 మంది కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,053 మందికి చెక్కులు అందగా, 31 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 1062 మందికి ఇంకా చెక్కులు అం దలేదు. అలాగే, షాదీముబారక్‌ కోసం 989 మం ది దరఖాస్తు చేసుకోగా, 568 మందికి చెక్కులు అందాయి. 17 దరఖాస్తులు తిరస్కరణకు గురవగా, 404 మందికి ఇంకా చెక్కులు అందలేదు.

ఆఫీసుల్లోనే పెండింగ్‌..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం లబ్ధిదారులు ‘మీసేవా’ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటారు. ఈ దరఖాస్తులు మీ సేవా కేంద్రం నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరతాయి. ఇక్కడ అధికారులు పరి«శీలించిన తరువాత ఆర్డీఓ కార్యాలయానికి అప్రూవల్‌ కోసం పంపించాలి. కానీ, చాలా దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే ఆగుతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికలు రావడంతో అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కారణంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల ప్రక్రియ నెమ్మదించింది. ఇప్పుడు కూడా అధికారులు లోక్‌సభ ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నారు.

దీంతో లబ్ధిదారులు వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇదిలా ఉంటే, నిధులు కొరత వల్లే చెక్కులు రావడం లేదని అధికారులు చెప్పారని లబ్ధిదారులు పేర్కొనడం గమనార్హం! కాగా, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించినట్లు తెలుసనీ, అధికారులు కూడా దరఖాస్తుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే తమకు ఆసరాగా ఉంటుందని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు