కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై నజర్

19 Mar, 2016 02:24 IST|Sakshi
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై నజర్

మొన్న మైనార్టీ, నిన్న ఎస్సీసంక్షేమశాఖలో ఏసీబీ తనిఖీలు
 
పాలమూరు
: పేద యువతుల పెళ్లిళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు జిల్లాలో పక్కదారి పడుతున్నాయన్న సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు.  పైరవీకారులు, అధికారులు కుమ్మక్కై అనర్హులకు ఈ రెండు పథకాలను వర్తింపజేస్తూ వారినుంచి వాటా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ప్రభుత్వం ఈ పథకాలను సమర్థంగా అమలుచేసే విషయమై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో గతంలో మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం.

దీంతో ఏసీబీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం గురువారం రోజు మైనార్టీ సంక్షేమశాఖలో ఏసీబీ అధికారులు షాదీముబారక్ పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అదే విధంగా శుక్రవారం ఎస్సీ అభివృద్ధిశాఖలో కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన రికార్డులను ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ పరిశీలించారు. ఏసీబీ తనిఖీల నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, అనర్హులకు వణుకు మొదలైంది.

 ఎస్సీ అభివృద్ధిశా ఖ పరిధిలో..
ఎస్సీ అభివృద్ధిశాఖ పరిధిలో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం 6,633 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 5,279 మందికి ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేల చొప్పున మంజూరు చేశారు. 516 దరఖాస్తులు కార్యాలయంలో 364 పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నాయి. 474 రిజెక్టు అయ్యాయి. రిజెక్టు లిస్టులో ఎక్కువగా ముందుగా పెళ్లి చేసుకొని తర్వాత చేసుకున్నట్లుగా తప్పుడు ఆహ్వానపత్రికలు పెట్టి దరఖాస్తు చేసుకున్న వారు, వయస్సు తక్కువగా ఉన్నవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మైనారిటీ సంక్షేమశాఖ..
మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న షాదీముబారక్ పథకానికి సంబంధించి ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,500 మంది మైనార్టీ యువతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 2037 మందికి రూ.51వేల చొప్పున మంజూరు చేశారు. 459 దరఖాస్తులు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. 4 దరఖాస్తులు రిజెక్టు అయినట్లు అధికారులు వెల్లడించారు.

 పైరవీకారులదే హవా...
కల్యాణలక్ష్మి పథకంలో పైరవీ కారులదే హవా కొనసాగుతుంది. ప్రభుత్వం పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాహ ఆహ్వాన పత్రికలో ఉన్న తేదీని తాజాగా పథకంలో అమల్లోకి వచ్చిన తేదీ నుంచి కొన్ని నెలల తర్వాతా వివాహం జరిగినట్లు మార్చి దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.

లబ్ధిదారుల నుంచి పర్సెంటేజీలకు ఒప్పందం కుదుర్చుకొని పైరవీకారులు కల్యాణలక్ష్మి దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం.  క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అధికారులు సైతం పైరవీకారులతో డబ్బులు తీసుకొని వాటిని జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నారు. వెరిఫికేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువశాతం కల్యాణలక్ష్మి దుర్వినియోగం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

 ఏసీబీ రంగప్రవేశంతో అధికారుల్లో వణుకు..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తుండటంతో అధికారుల్లో వణుకు మొదలైంది. గురువారం మైనార్టీ సంక్షేమశాఖలో, శుక్రవారం ఎస్సీ సంక్షేమశాఖలో ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ రికార్డులను పరిశీలించారు. ఎస్సీ సంక్షేమశాఖలో డీడీ శ్రీనివాసరావు, ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాందాస్‌తేజ విలేకరులతో మాట్లాడారు. చాలా మంది అక్రమంగా లబ్ధిపొందిన వారిపై ఫోన్‌ద్వారా సమాచారం వచ్చిందని, పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి క్షేత్రస్థాయిలోనూ పరిశీలిస్తామని వెల్లడించారు. దళారులపై కూడా చర్యలుంటాయని తెలిపారు.

ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయని, అక్రమాలు చేసినట్లు గుర్తిస్తే పై అధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ వెల్లడించారు. ఎలాంటి అవినీతి ఉన్నా 94913 05609 నంబర్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.
 
 ఏప్రిల్-2015 నుంచి వివరాలు
 
 కల్యాణలక్ష్మి
 
మొత్తం దరఖాస్తులు    6,633
మంజూరైనవి               5,279
 పెండింగ్                        880
రిజెక్ట్                             474
 
 షాదీముబారక్

 మొత్తం దరఖాస్తులు    2,500
 మంజూరైనవి                2037
 పెండింగ్                       459
 రిజెక్ట్                                4

మరిన్ని వార్తలు