అమ్మో పులి.. వచ్చెను మళ్లీ

2 Oct, 2014 04:47 IST|Sakshi
అమ్మో పులి.. వచ్చెను మళ్లీ

కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను పులి భయపెడుతోంది. భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో అడుగుజాడలు కనిపించాయి. దోమకొండలో ఇద్దరు వ్యక్తులు తాము పులిని చూశామని పేర్కొనడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

- పులిని చూశానంటున్న మహిళ
- భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో అడుగుజాడలు!
- భయాందోళనల్లో మూడు మండలాల ప్రజలు
- రంగంలోకి అటవీ అధికారులు

 దోమకొండ : మండల కేంద్ర శివారులో బుధవారం మళ్లీ పులి కలకలం సృష్టించింది. దీంతో రైతులంతా ఉలిక్కిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రైతు కదిరె వెంకట్‌రెడ్డి తన భార్య ఇందిరతో కలిసి బుధవారం ఉదయం మల్లన్న గుడి వెనకాల గల వ్యవసాయ భావి వద్దకు వెళ్లాడు. ఇందిర బంతిపూలు తెంపుతుండగా వెంకట్‌రెడ్డి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. పూలు తెంపిన అనంతరం ఇందిర భర్త దగ్గరికి వెళ్లడానికి బంతి పూల చెట్ల మధ్యలోంచి లేవగానే పులి కనిపించింది. దీంతో భయపడి చెట్ల మధ్యలోనే దాక్కుంది. భయం వల్ల స్పృహతప్పి పడిపోయింది. కొద్దిసేపటికి అటుగా వచ్చిన వెంకట్‌రెడ్డి ఆమెను లేపాడు. దీంతో ఆమె విషయం చెప్పింది.

వెంటనే వారు అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయా రు. బుధవారం ఉదయం మల్లన్న గుడి శివారులో పులి కనిపించిందని ఆలయ వాచ్‌మన్ నేతుల మల ్లయ్య కూడా తెలిపాడు. తాను అక్కడే ఉండి రైతులు పులి వెళ్లిన వైపు వెళ్లకుండా చూశానన్నారు. రైతులు ఈ సమాచారాన్ని అటవీ అధికారులకు అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేణు, బీట్ ఆఫీసర్ పారూఖ్‌ల ఆధ్వర్యంలో ఆరుగురు కానిస్టేబుళ్లు మల్లన్న గుడి వెనకాల ఉన్న పొలాల్లో పులికోసం గాలించారు. పొలాల వద్ద గడ్డి ఉండడంతో పులి అడుగులను గుర్తించలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.

మాచారెడ్డి అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన రెండేళ్ల వయసున్న చిరుతపులి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందన్నారు. రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వెంట కర్రలు తీసుకొని వెళ్లాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. పులిని బం ధించడానికి మెదక్‌లో రెస్క్యూ టీం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దోమకొండ శివారుతో పాటు భిక్కనూరు మండలంలోని జంగంపల్లి, పొందుర్తి, మాచారెడ్డి మండలంలోని పల్వంచ, ఎల్పుగొండ తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు