పొదుపు పేర.. మోసం!

9 Oct, 2019 10:21 IST|Sakshi
 జేసీకి వినతిపత్రం ఇస్తున్న వృద్ధులు

పింఛన్లను పొదుపు చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పిన పోస్టల్‌ అధికారి 

10 మాసాలుగా ప్రతి నెలా రూ.500 నుంచి రూ.3వేల వరకు కట్టిన పెన్షన్‌దారులు

మూడు మాసాలుగా డబ్బులు తీసుకునేందుకు రాని అధికారి

అనుమానంతో కనగల్‌ పోస్టాఫీస్‌కు వెళ్లిన వృద్ధులు

మోసపోయామని గ్రహించి జాయింట్‌ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు

సాక్షి, నల్లగొండ: మూడేళ్ల పాటు పొదుపు చేసుకుంటే అదనంగా డబ్బులు వస్తాయి అంటూ వృద్ధులకు మాయ మాటలు చెప్పాడు ఓ పోస్టల్‌ అధికారి. ఆయన మాటలు నమ్మి  దాదాపు వంద మంది వృద్ధులు పెన్షన్‌ డబ్బులతో మరికొన్ని కలిపి ఇచ్చారు. ఇలా పదినెలలుగా కడుతూ వస్తున్నారు. సదరు పోస్టల్‌ అధికారి తీసుకెళ్లి జమ చేస్తున్నానని ఆ వృద్ధులను నమ్మించాడు. మూడు నెలలుగా సదరు అధికారి రాకపోవడంతో అనుమానం వచ్చి పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా మీ అకౌంట్లలో ఎటువంటి డబ్బులు జమ కాలేదు.. డబ్బులు వసూలు చేసిన పోస్టల్‌ అధికారిని విధులనుంచి తొలగించామని చెప్పడంతో వృద్ధులు లబోదిబోమని కన్నీటి పర్యంతమయ్యారు. తాము మోసపోయామని గ్రహించి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ ముందు గోడు వెల్లబోసుకున్నారు.  ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కనగల్‌ మండలం బోయినపల్లి గ్రామంలో పోస్టల్‌ అధికారి ప్రసాద్‌ ప్రతి నెలా వివిధ రకాల సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేవాడు. ఈ క్రమంలో పింఛన్‌ తీసుకుంటున్న వృద్ధులను మాయమాటలతో నమ్మించాడు. ‘ప్రతి నెలా పోస్టాఫీస్‌లో రూ.వెయ్యి చొప్పున మూడేళ్ల పాటు జమ చేసుకుంటే మీరు కట్టిన డబ్బులతో కలిపి అదనంగా మొత్తం రూ.50వేలు వస్తాయి.. మీరు చేతగాని వేళల్లో హాయిగాబతికేందుకు పనికి వస్తాయి’ అంటూ మాటలు చెప్పి వారి నుంచి పొదుపు కట్టించాడు. గ్రామంలో దాదాపు వంద మంది మహిళలు రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పొదుపు డబ్బులు కడుతూ వస్తున్నారు. ప్రతి నెలా పెన్షన్లు అక్కడే వారికి ఇవ్వడం, ఇచ్చిన డబ్బులనే తిరిగి పొదుపు పేర పోస్టల్‌ అధికారి ప్రసాద్‌ లబ్ధిదారులనుంచి కట్టించుకున్నాడు. పోస్టాఫీసుల్లో కొందరికి అకౌంట్‌ బుక్‌లు తీశాడు. ఆ బుక్కుల్లోనే ప్రతి నెలా వారు కట్టిన డబ్బులకు సంబంధించి బుక్కులో ఎంత కట్టారు, ఎంత జమ అవుతుంది రాస్తూ వస్తున్నాడు. కొందరి మహిళల మొత్తం పొదుపు చేసుకున్నవి రూ.5వేల నుంచి రూ.40 వేల వరకు ఉన్నాయి. 

మూడు నెలలుగా రాని పోస్టల్‌ అధికారి
మూడు మాసాలుగా వృద్ధాప్య పెన్షన్లు పంచేం దుకు ప్రసాద్‌ రావడం లేదు. అతనికి ఫోన్‌ చేసినా ఫోన్‌ కలవడంలేదు. కొత్త వ్యక్తులు వస్తున్నారు. దీంతో కనగల్‌ మండల కేంద్రంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి తమ పాస్‌ బుక్‌లలో ఉన్న డబ్బులు కావాలని అడిగారు. వాటిని పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పడంతో తెల్లముఖం వేశారు. ‘ప్రతి నెలా మీరు పంపిన వ్యక్తే వచ్చి ఒక చేత్తో పెన్షన్లు ఇచ్చి మరో చేత్తో పొదుపు కట్టించుకున్నాడు... డబ్బులు లేవంటే ఎలా’ అని ప్రశ్నించారు. ‘అతన్ని ఉద్యోగంనుంచి తీసేశాం. మీరు చండూరు పోస్టాఫీస్‌కు వెళ్లి అడగండి’ అని సలహా ఇచ్చారు. దీంతో వృద్ధులు చండూరు వెళ్లి అడగగా,  పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పారు. కేవలం మీ దగ్గర ఉన్న పాస్‌బుక్కుల్లో రాశాడు కానీ అకౌంట్లలో జమ చేయలేదని తెలిపారు. దీంతో మోసపోయామని తెలుసుకుని సింగం లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ను కలిసి గోడును వెల్లబోసుకున్నారు.  పోస్టల్‌ అధికారి మోసం చేశాడని, న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. జేసీ.. వెంటనే పోస్టల్‌ సూపరింటెండెంట్‌ను ఫోన్‌లో సంప్రదించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వారు   ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.  ఆయన పూర్వాపరాలు తెలుసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఆదేశించారు.

మోసం చేశాడు.. 
పెన్షన్‌ డబ్బులు ఇచ్చే వ్యక్తే కదా ఆయనే పొదుపు కట్టించుకుంటే మా డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అనుకున్నాం. నమ్మకంతో పొదుపు చేశాం. పాస్‌ పుస్తకాల్లో డబ్బులు కట్టించుకున్నట్లు రాశాడు. పోస్టాఫీస్‌ వాళ్లు డబ్బులు లేవంటున్నారు. వచ్చిన పెన్షన్‌ అంతా తినీ తినక పొదుపు చేసుకుంటే మోసం చేశాడు.  
– దేవకమ్మ, బోయినపల్లి, కనగల్‌  

ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు
పెన్షన్‌ డబ్బులు ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు. పొదుపు చేసుకుంటే మరిన్ని డబ్బులు వస్తాయన్నాడు. డబ్బులు తీసుకుందామని వెళ్తే వారు లేవంటున్నారు. మాకు న్యాయం చేయాలి.
– జెట్టి వీరమ్మ, బోయినపల్లి, కనగల్‌ 

మాకు న్యాయం చేయాలి
గవర్నమెంట్‌ ఇచ్చిన పెన్షన్‌ డబ్బులు దాచుకుని పొదుపు చేసుకుంటే పోస్టల్‌ అధికారి మోసం చేశాడు. మా డబ్బులు తీసుకొని పోస్టాఫీస్‌లో కట్టలేదు. మాకు మూడు నెలల నుంచి డబ్బులు తీసుకెళ్తలేడని పోస్టాఫీస్‌కు వెళ్తే ఆయన లేడని తెలిసింది. డబ్బులు ఇవ్వమంటే కట్టలేదంటున్నారు. డబ్బులు స్వాహా చేసిన అధికారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి.
 – సైదమ్మ, బోయినపల్లి, కనగల్‌  

మరిన్ని వార్తలు