ఖమ్మంలో కంచ ఐలయ్య అరెస్ట్‌

4 Dec, 2017 01:54 IST|Sakshi

పోలీసు వాహనాలకు అడ్డుపడిన ఆందోళనకారులు 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మహాసభలకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ.. సభలో పాల్గొనేందుకు కంచ ఐలయ్యకు అనుమతి లేదని, ఆయన వస్తే అడ్డుకుంటామని సంఘానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో సభలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం 5 గంటలకు ఖమ్మంలోని సుందరయ్య భవనానికి ఐలయ్య చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ పెద్దఎత్తున మోహరించారు. సభలో ఐలయ్య పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నేత నున్నా నాగేశ్వరరావు, జిల్లా కమిటీ నాయకులు పోలీస్‌ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. అధికారులు అనుమతి లేదని, ఐలయ్యను ఖమ్మం నుంచి పంపించేందుకు సహకరించాలని సూచించారు. ఐలయ్య మాత్రం ఎట్టి పరిస్థితిలో సభలో పాల్గొంటానని చెప్పడంతో బహిరంగ సభ వేదిక వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

సుందరయ్య భవనం నుంచి సభకు వెళ్లేందుకు బయటకు వస్తున్న ఐలయ్యను పోలీసులు భవనం బయట అడ్డుకొని అరెస్టు చేశారు. ఐలయ్య అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, టీమాస్‌ నాయకులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులు ఐలయ్యను ఎక్కించిన వాహనం ఎదుట పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఐలయ్యను పోలీస్‌ భద్రత మధ్య ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. 

నాకేమైనా ప్రభుత్వానిదే బాధ్యత : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న తనకు ఏదైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తన పెన్నును చూసి గన్నులు ఎందుకు వణుకుతున్నాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఖమ్మం వచ్చిన ఆయన సుందరయ్యభవనంలో విలేకరులతో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు